Thursday, April 29, 2010

పంచమ వేదం

ఋగ్వేదం నుంచి వాయిద్యం 
యజుర్వేదం నుంచి అభినయం 
సామవేదం నుంచి సంగీతం 
అధర్వణవేదం నుంచి భావ ప్రకటన 

ఉద్భవించాయంటారు. నాలుగు వేదాలలోని లక్షణాలను సంతరించుకున్నది కనుక నాట్యాన్ని ' పంచమవేదం ' అంటారు.
 నాట్యానికి రాజు ' నటరాజు '.

సుమారు రెండు వేల సంవత్సరాలకు పూర్వం భరతముని రాసిన ' నాట్యశాస్త్రము ' మనకి నాటక కళను నేర్పింది. నాట్యమేళ సాంప్రదాయం శాస్త్రీయ కళగా రూపొందడానికి నాట్యశాస్త్రం దోహదపడింది.

క్రీ.శ. 3 వ లేదా 4 వ శతాబ్దంలో నందికేశుడు రచించినట్లుగా చెప్పబడుతున్న ' భరతార్ణవం ' అప్పటివరకూ అమలులోవున్న ఏకపాత్రకేళికా సాంప్రదాయాన్ని కళాఖండాలుగా తీర్చిదిద్దింది. దీనికి సంక్షిప్త రూపమైన ' అభినయ దర్పణం ' నాట్యాచార్యులకు భగవద్గీతలాంటిదని చెబుతారు.


క్రీ.శ. 1253-54 ప్రాంతంలో కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని బావమరిది అయిన జాయపసేనాని ' నృత్త రత్నావళి ' రచించాడు. ఈయన కృష్ణాజిల్లాలోని దివిసీమకు చెందిన వాడుగా చరిత్ర.. జాయపను చిన్నప్పుడే గణపతి దేవుడు ఓరుగల్లుకు తీసుకువెళ్ళి గుండయామాత్యుడనే నాట్యాచార్యుని దగ్గర జేర్చి నాట్యకళను నేర్పించాడు. ఆనాటి నాట్య శాస్త్రాలను, సాంప్రదాయాలను క్షుణ్ణంగా పరిశీలించి, పరిశోధించి తన అనుభవములను కూడా జోడించి ' నృత్తరత్నావళి ' ని రచించాడు.


దేవగిరిని పాలించిన యాదవరాజుల ఆస్థాన విద్వాంసునిగా వున్న శార్జ్ఞ్గదేవుడు తాను రచించిన ' సంగీత రత్నాకరము ' అనే గ్రంథములో భారత నాట్య రీతుల్లో వచ్చిన మార్పుల్ని వివరించాడు.


భారత దేశంలో సంస్కృతం రాజభాషగా వున్న కాలంలో ఇన్ని రకాల నృత్య రీతులు లేవు. దేశమంతటా ఒకే రకమైన శాస్త్రీయ నృత్యకళ వుండేది. ప్రాంతీయ భాషల ప్రాముఖ్యం పెరిగి, సంస్కృతం ప్రాముఖ్యం తగ్గడంతో ప్రాంతాల వారీగా నృత్య రీతులు అభివృద్ధి చెందాయి. వింధ్య పర్వతాలకు దక్షిణాన వున్న తెలుగు భాష సంగీతానికి, సాంస్కృతిక వికాసానికి అనువైన భాషగా పండితులు, విద్వాంసులు గుర్తించారు. దాంతో తెలుగు భాషలో అనేక నృత్య సంగీత రచనలు వెలువడ్డాయి. అందుకే దక్షిణాదిన ప్రధానంగా తెలుగు పాటే వినబడుతుంది.


ప్రాచీన కాలంలో మతానికి, కళలకి దగ్గర సంబంధముండేది. అందుకే దేవాలయ శిల్పాలలో మనం నాట్యకళను దర్శించవచ్చు. యజ్ఞయాగాది క్రతువుల్లో సంగీత నృత్యాలు భాగమై వుండేవి. బౌద్ధ, జైన మతాలు కూడా నాట్యకళను ప్రోత్సహించినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. శాతవాహన, ఇక్ష్వాక రాజుల చరిత్రలలో ఈ ప్రస్థావన కనిపిస్తుంది. హాలుని గాథాసప్తశతి, గుణాఢ్యుని బృహత్కథలలో కూడా నాట్య ప్రస్థావన వున్నట్లు చెబుతారు. గుజరాతీ, కన్నడ భాషల్లో వున్న జైన మత గ్రంథాలలో నృత్యభంగిమలు, నర్తనరీతుల గురించి వున్నట్లు తెలుస్తోంది. తర్వాత కాలంలో వ్యాప్తిలోకి వచ్చిన శైవ, వైష్ణవ సాంప్రదాయాలు రెండూ నాట్యకళకు పెద్దపీటే వేసాయని చెప్పవచ్చు.

ఇక తెలుగు కళను సుసంపన్నం చేసిన కూచిపూడి నాట్య సాంప్రదాయం కృష్ణాజిల్లాలోని ఒక చిన్న గ్రామమైన ' కూచిపూడి ' నుంచి వచ్చింది. క్రీ.శ. 13 లేదా 14 వ శతాబ్దులలోనే ఈ సాంప్రదాయానికి మూలాలు వున్నట్లు చెబుతారు. ఆ ప్రాంతానికి చెందిన నృత్యకళా ప్రవీణుడు, వాగ్గేయకారుడు అయిన సిద్ధేంద్ర యోగి ' భామాకలాపం ' రచించి కూచిపూడి భాగవతులకు నేర్పించాడు. క్రీ.శ. 1506-09 ప్రాంతాలలో కూచిపూడి భాగవతులు హంపీ విజయనగరంలో ప్రదర్శనలిచ్చినట్లు ఆధారాలున్నాయి. ఇవి ప్రధానంగా నృత్య రూపకాలు. కూచిపూడికి దగ్గరలోనే ' మువ్వగోపాల పదాలు ' రచించిన మహాకవి క్షేత్రయ్య నివసించిన మొవ్వ గ్రామం వుంది. ఈ విషయం మీద చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నట్లుగా తోస్తుంది. అక్కడికి సమీపంలో ఒకప్పుడు శాతవాహనుల రాజధాని అయిన శ్రీకాకుళం కూడా వుంది. ' కృష్ణలీలాతరంగిణి '  రచించిన నారాయణ తీర్థులువారు కూడా శ్రీకాకుళానికి చెందిన వారేనని ఒక వాదన.

ఇప్పుడు మనం భరతనాట్యంగా పిలుచుకుంటున్న సాంప్రదాయాన్ని మహారాష్ట్ర రాజైన రెండవ శరభోజి ఆస్థానంలో విద్వాంసులుగా వున్న నలుగురు సోదరులు రూపొందించిన సదిర్ లేదా దాసి ఆట నుండి రూపాంతరం చెందింది. ఐతే ఇది భరతనాట్యంగా 1930 తర్వాతే విస్తృత ప్రచారం పొందిందట. క్రీ.శ. 17 వ శతాబ్దంలో కథకళి , ఆ తర్వాత కాలాల్లో ఒడిస్సీ, మణిపురి, కథక్ మొదలైన సాంప్రదాయాలు మన దేశంలో రూపుదిద్దుకున్నాయి.ఇవన్నీ మూడు వందల సంవత్సరాల కాలంలోనివే !


ఆంధ్ర దేశంలో నాట్య సాంప్రదాయం రెండు రకాలు . ఒకటి నట్టువ మేళం. రెండు నాట్యమేళం. నట్టువమేళం ఏకపాత్ర నృత్యము. ఇది ఎక్కువగా దేవదాసీ సాంప్రదాయంగా వుండేది. నాట్యమేళం సామూహికంగా ఎక్కువ పాత్రలతో రూపకాలుగా వుండేది. కూచిపూడి ఆ సాంప్రదాయానికి చెందినదే. వీటిని ' యక్షగానాలు ' అని కూడా పిలిచేవారు.
అలాగే ఆలయాల్లో చేసే ఆగమ శాస్త్ర నర్తనం, రాజాస్థానాలలో చేసే ఆస్థాన నర్తనం, కలాపాలు, భాగవతాలతో కూడిన ప్రబంధ నర్తనం అనే మూడురీతులు ప్రచారంలో వుండేవి. ప్రముఖ నాట్యాచార్యులు నటరాజ రామకృష్ణ గారు ఈ మూడు రీతుల్నీ సమన్వయ పరుస్తూ ' ఆంధ్ర నాట్యం ' అనే కొత్త రీతిని ప్రచారంలొకి తెచ్చారు. అలాగే ఆయన జాయప సేనాని రచించిన ' నృత్తరత్నావళి ' నుంచి ' పేరిణి ' అనే నృత్యాన్ని గ్రహించి ' పేరిణి శివతాండవం ' పేరుతో పునరుద్ధరించారు.

సూక్ష్మంగా మన నాట్య కళా చరిత్ర ఇది. అంతర్జాతీయ నాట్య దినోత్సవం ( ఏప్రిల్ 29 ) సందర్భంగా ఒకసారి సింహావలోకనం చేసుకుంటూ..... ఎందరో కళాకారులు మన నాట్య కళా సాంప్రదాయాన్ని సుసంపన్నం చేసారు. అందులో ముఖ్యమైన వారిని ఈ శుభసందర్భంగా తలచుకుందాం ! 



Vol. No. 01 Pub. No. 274

3 comments:

ఆ.సౌమ్య said...

చాలా మంచి విషయాలు తెలియజేసారు. నెనర్లు !

కొత్త పాళీ said...

మంచి విషయాలు చెప్పారు.

SRRao said...

* సౌమ్య గారూ !
* కొత్తపాళీ గారూ !

ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం