Saturday, March 20, 2010

' శోభన ' మైన ' బాబు '

1959 లో ' దైవబలం ' చిత్రంతో చిత్ర సీమలో అడుగుబెట్టిన ఉప్పు శోభనాచలపతిరావు 1960 లో ' భక్త శబరి ' చిత్రంతోనే శోభన్ బాబు గా ప్రేక్షకుల ముందుకొచ్చారు.

అనేక రకాల ఒత్తిళ్ళు, రాజకీయాలకు నెలవైన సినిమా ప్రపంచంలో ప్రశాంతమైన జీవితం గడిపిన నటుడు శోభన్ బాబు. ఆకర్షణలకు, వ్యామోహాలకు, పొగడ్తలకు లొంగి సంపాదించినదంతా హారతి కర్పూరం చేసెయ్యడం సినిమా జీవులకు అలవాటు. అందుకు భిన్నంగా సంపాదనను జాగ్రత్త చెయ్యడమే కాకుండా మరింత వృద్ధి చేసిన జాగ్రత్తపరుడు. కొంతమంది ఎన్ని అనుభవాలు ఎదురైనా వాటి నుంచి నేర్చుకుని భవిష్యత్తులో జాగ్రత్తపడరు. అహం అడ్డొస్తుంది. కానీ సినిమా రంగంలో నిలదొక్కుకోవడానికి పడ్డ కష్టాలు, సీనియర్ల అనుభవాలు శోభన్ బాబుని జాగ్రత్తపడేలా చేసాయి.

' వీరాభిమన్యు ' ఆయన నటజీవితాన్ని మలుపుతిప్పిన చిత్రం. కార్మిక నాయకుడిగా ' మనుష్యులు మారాలి ', సంఘర్షణకు లోనయ్యే రెండు విభిన్న పాత్రల్లో ' మానవుడు దానవుడు ', గ్లామర్ కు ఏమాత్రం ఆస్కారంలేని పాత్రలో ' చెల్లెలి కాపురం ', ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోయే పాత్రల్లో ' ఇల్లాలు ప్రియురాలు ', ' గోరింటాకు ', ' కార్తీకదీపం ' వగైరా, ' భక్త శబరి ', ' భీష్మ ' , 'నర్తనశాల ', ' వీరాభిమన్యు ', ' సంపూర్ణ రామాయణం ', ' కురుక్షేత్రం ' లాంటి పౌరాణిక చిత్రాల్లో, ' తాసిల్దారుగారి అమ్మాయి ', ' రాధాకృష్ణ ', ' జీవనతరంగాలు ' లాంటి నవలా చిత్రాల్లోనూ విభిన్నమైన పాత్రలను పోషించిన విలక్షణ నటుడాయన,

మితంగా మాట్లాడటం, పబ్లిసిటీకి దూరంగా వుండటం ఆయన నైజం. సాయింత్రం ఆరు గంటల తర్వాత షూటింగ్లో పాల్గొనకపోవడం, ఆదివారం సెలవు తీసుకోవడం, కుటుంబ సభ్యులతో వీలైనంత ఎక్కువ సమయం గడపడం ఆయన తనకు తాను విధించుకున్న నియమాలు. 1997 లో షష్టిపూర్తి జరిగాక ఎందరెన్ని చెప్పినా చిత్రసీమనుంచి రిటైర్ అయ్యి చివరి వరకూ ప్రశాంత జీవనం గడిపారు. అందాల నటుడిగా శోభాయమానంగా వెలిగిన శోభన్ బాబు 20 మార్చి 2008 న స్వర్గస్తులయ్యారు. ఆయన వర్థంతి సందర్భంగా నివాళులర్పిస్తూ.........



Vol. No. 01 Pub. No. 230

3 comments:

Rao S Lakkaraju said...

నియమ బద్ధత ఉంటె జీవితం రాణిస్తుందని చెప్పటానికి శోభన బాబు తార్కాణం. థాంక్స్ ఫర్ పోస్టింగ్ మాణిక్యాలు.

sreenika said...

భవిష్యత్తు పట్ల దార్శనికత, జీవితంలో నైతికత ఉండాలని తాను ఆచరించి అందరికి ఆదర్శప్రాయుడయ్యాడు. చిరస్మరణీయుడు, నిత్య శోభితుడు శోభనబాబు.
ధన్యవాదుములు.

SRRao said...

* రావు గారూ !
* శ్రీనిక గారూ !

ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం