Wednesday, March 17, 2010

కొత్త సంవత్సరానికి కొత్త ప్రతిపాదన







మన జీవితాల్లో మరో ఉగాది వచ్చింది.
క్రిందటి సంవత్సరం పేరుకు తగ్గట్టుగానే విరోధాలను పెంచింది.

దొంగలు, హంతకులు, స్మగ్లర్లు లాంటి నేరస్తులు కూడా సమాజంలో సభ్యులే ! వారి చర్యలను వారు సమర్థవంతంగానే సమర్థించుకోవచ్చు. తనకు బ్రతుకు తెరువు కోసం దొంగతనాలు చేస్తున్నానంటాడు దొంగ. అలాగే ఇతరులకు కూడా వారి వారి కారణాలు వారికీ వుంటాయి. ఎటొచ్చీ సమాజానికి మాత్రం వారి చర్యలను అంగీకరించేటంత విశాల హృదయం వుండదు.

పుట్టుకతోనే అందరూ మహాత్ములు కారు. వారి వారి ఆలోచనా విధానాలు, ప్రవర్తనా, ఇతరుల్నీ- సమాజాన్ని ప్రభావితం చేసే తీరు కారణంగా వారు మహాత్ములుగా గుర్తించబడతారు. ఇందుకు మనకు కనిపించే మంచి ఉదాహరణ గాంధీ.

ఆయన తన వ్యక్తిగత జీవితాన్ని, సంతోషాల్ని త్యాగం చేసాడు కాబట్టే అన్ని కోట్లమంది ప్రజల్ని, ప్రపంచాన్నీ ప్రభావితం చెయ్యగలిగాడు. కానీ ఉద్యమంలోకి రాక ముందు ఆయన వ్యక్తిగత జీవితం అందరు సామాన్యుల్లాగే సాగింది.

ప్రజల్ని ప్రభావితం చేసిందీ, ఏకచత్రాధిపత్యంగా పాలన సాగిస్తున్న బ్రిటిష్ వారిని లొంగదీసిందీ ఆ జీవితం కాదు. నిజానికి గాంధీ గారి సామాన్య జీవితం మనకు అవసరం లేదు. మనం స్పూర్తిగా తీసుకోవలసినది ఆయన ఉద్యమ జీవితమే ! ఏ కారణంగా ఆయన్ని మన దేశమే కాకుండా ప్రపంచమంతా మహాత్ముడిగా కొనియాడుతోందీ, విదేశాలలో కూడా ఆయన విగ్రహాలెందుకు పెట్టవలసి వచ్చిందీ, ఇటీవల అమెరికాలో అప్పటివరకూ వున్న వేరే పేరును మార్చేసి గాంధీ పేరును ఒక ముఖ్యమైన జిల్లాకి ఎందుకు పెట్టారో ఒక్కసారి ఆలోచిస్తే........ ఆయన వ్యక్తిగత జీవితానికి ప్రభావితులై మాత్రం వాళ్ళు ఆ పనులు చెయ్యలేదనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇదొక ఉదాహరణ మాత్రమే !

మహానీయులందరూ పుట్టుకతోనే మహనీయులుగా పుట్టలేదు. వాళ్ళు కూడా మామూలు జీవితాలను అనుభవించిన వారే ! వాళ్ళ జీవితాలన్నీ ఎక్కడో ఒక సందర్భంలో మలుపు తిరిగి మహనీయులుగా రూపు దిద్దుకుంటాయి. వారి మామూలు జీవితం మనకు ఆదర్శమా, మహనీయులుగా మారిన తర్వాత జీవితం మనకు ఆదర్శమా అంటే విజ్ఞులైన ఎవరైనా ఏది కోరుకుంటారు ?

కిరాతకుడిగా వున్న వాల్మీకి కావాలా ? మహర్షిగా రామాయణాన్ని రాసిన వాల్మీకి కావాలా ?
భోగిగా వున్న వేమారెడ్డి కావాలా ? యోగిగా మారి జీవిత సత్యాల్ని ప్రజలకు సరళమైన పద్య సంపదగా అందించిన వేమన కావాలా?
తాను కూర్చున్న కొమ్మను నరుక్కోబోయిన అజ్ఞాని కావాలా ? మహాకావ్యాలను సృష్టించిన మహాకవి కాళిదాసు కావాలా ?

ఇలా అడిగితే ఎవరైనా ఏం సమాధానం చెబుతారు ?

అలాగే బ్లాగుల్లో రాస్తున్నది ఆడవాళ్ళా, మగవాళ్ళా - వాళ్ళ వ్యక్తిగత జీవితాలేమిటి అనేది అవసరమా ? లేక వాళ్ళు రాసే విషయ సంపద అవసరమా ?

ఎవరికి తెలిసిన, నచ్చిన విషయాలను మాట్లాడే, రాసే స్వేచ్చ మనకు వుంది. కానీ ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడే, రాసే హక్కు ఎవ్వరికీ లేదు.

విరోధి నామ సంవత్సరంలో కొంతమంది మంచిగా రాసి, మరికొంతమంది చెడ్డగా రాసి విరోదుల్ని పెంచుకున్నారు. మంచిగా రాస్తే విరోదులేమిటంటే మంచిగా రాస్తున్న వారిని ఈ చెడురాతలు రాసేవారు వెంటాడినట్లుగా నాకనిపించింది,

వికృతి నామ సంవత్సరంలోనైనా చెడురాతలు రాసే వికృత సంస్కృతికి తిలోదకాలిచ్చేద్దామని, బ్లాగు లోకాన్ని మంచి సమాచారంతో, రచనలతో, సందేశాలతో గుబాళించేటట్లు చెయ్యాలని ఆ బాపతు బ్లాగు మిత్రులు ఈ ఉగాది రోజునైనా తీర్మానం చేసుకుంటే బాగుంటుందేమో ? ఇది కొత్త సంవత్సరంలో నా కొత్త ప్రతిపాదన. మరి మిగిలిన మిత్రులేమంటారో ?

ఏమైనా మనకున్న/ తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచుదాం.... పంచుకుందాం ! అంతే కానీ మన మానసిక వికారాల్ని బ్లాగర్లపై , బ్లాగులోకం పైనా రుద్దకూడదని అందరూ తీర్మానించుకుంటే బ్లాగు లోకం ఆరోగ్యంగా వుంటుంది, మన మానసిక ఆరోగ్యం కూడా బాగుపడుతుందని నా నమ్మకం.

చివరగా ఈ మానసిక వికారుల బారిన పడిన బ్లాగు మిత్రులకు ఒక మాట. ఒకప్పుడు కుష్టు రోగుల్ని చూసి అసహ్యించుకునేవారు. అలాగే ఎయిడ్స్ రోగుల్ని చూసి అసహ్యంతో బాటు, భయం కూడా పడేవారు. దాంతో వాళ్ళు నిరాశా, నిస్పృహలకు లోనై మానసికంగా కృంగిపోయి కసితో కొన్ని దారుణాలు చెయ్యడానికి సిద్ధపడేవారు. కానీ వాళ్ళను సానుభూతితో అర్థం చేసుకుంటే కనీసం మానసికంగానైనా ఆరోగ్యంగా వుంటారు. దాంతో కొంతమందినైనా నేరస్తులుగా తయారవకుండా నివారించిన వారమవుతాం !

అలాగే బ్లాగుల్లో మానసిక వికారాల్ని ప్రదర్శించే వారిపట్ల జాలి, సానుభూతి చూపించండి. కానీ భయపడకండి. కోప్పడకండి. రెచ్చగొట్టకండి. తప్పక వారిలో మార్పు వస్తుంది. ఈ వికృతి అయినా వారిలోని వికృతాన్ని పోగొట్టాలని కోరుకుందాం ! దీనికి అత్యంత ఎక్కువ ప్రాముఖ్యమివ్వడం బ్లాగులోకాన్ని మరింత కలుషితం చేస్తుంది. ప్రాముఖ్యమివ్వవలసిన సమస్యలు సమాజంలో ఇంకా చాలా వున్నాయి. వాటిని గురించి చర్చిద్దాం. కనీసం ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక పరిష్కారమైనా లభించే అవకాశం వుంది.

ఈ కొత్త సంవత్సరంలో మరో కొత్త ప్రతిపాదన వచ్చే టపాలో ............

Vol. No. 01 Pub. No. 228

4 comments:

చిలమకూరు విజయమోహన్ said...

మంచి ఆకాంక్ష

Ravi said...

బాగున్నాయి మీ కోరికలు...

రవీంద్రనాధ్ గెడ్డం said...

మంచి ప్రతిపాదన.

SRRao said...

* విజయ్ మోహన్ గారూ !
* రవిచంద్ర గారూ !
* రవీంద్రనాథ్ గారూ !

ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం