Tuesday, March 2, 2010

తొలి భారతీయ ఆంగ్ల టాకీ చిత్రం ' కర్మ '

హిమాంశురాయ్ అనే తొలి తరం భారత నిర్మాత, దర్శకుడు జర్మనీ సహకారంతో 1926 లో ' ది లైట్ అఫ్ ఆసియా ' అనే చిత్రాన్ని నిర్మించాడు. అంతర్జాతీయ సహకారంతో నిర్మించిన మొదటి చిత్రం అదే. అయితే అది మూకీ చిత్రం. తర్వాత జర్మనీ సంస్థ అయిన UFA ( Universum Film Aktiengesellschaft ) తో కలసి మరో రెండు చిత్రాలు నిర్మించారు.

1930 లో నిర్మించిన ' A thrown of dice ' చిత్రంతో తొలి తరం కథానాయిక దేవికారాణి వెండితెరకు పరిచయమైంది. అప్పటికి దేవికారాణి ఇంగ్లాండ్ లో ఆర్కిటెక్చర్, ఫిలిం క్రాఫ్ట్ చదువుతోంది. మన విశాఖపట్నంలో కల్నల్ డా. ఎం.ఎన్. చౌదరి, లీల దంపతులకు జన్మించిన దేవికారాణి విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ మేనకోడలు. ' A thrown of dice ' నిర్మాణ సమయంలోనే హిమంశురాయ్, దేవికారాణి పెళ్లి చేసుకున్నారు.

ప్రపంచ చలనచిత్ర రంగం మాటలు నేర్చుకుంది. మూకీలు  టాకీలుగా మారాయి. ఇంగ్లాండ్ కు చెందిన I.B.P. సంస్థతో కలిసి హిమంశురాయ్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో ' కర్మ ' చిత్రం మొదలు పెట్టాడు. అందులో హిమంశురాయ్, దేవికారాణిలే నాయిక నాయకులు. సీతాపూర్ మహారాణికి, జయనగర్ యువరాజుకు మధ్య నడిచే ప్రేమాయణం, యువరాజుని అతని తండ్రి నిర్భంధించి వారి ప్రేమను భగ్నం చెయ్యడం ఈ చిత్ర కథ. లండన్ లోని మార్బుల్ ఆర్చ్ పెవిలియన్ లో 1933 మే నెలలో ఈ చిత్రం విడుదలయింది.

ఈ చిత్రంతో దేవికారాణి ప్రపంచ ప్రేక్షకలోకానికి కలలరాణి అయింది. పాశ్చాత్య పత్రికా ప్రపంచం ఈమె అందాన్ని, వాచకాన్ని వేనోళ్ళ కీర్తించింది. ఈ చిత్రం భారతదేశంలో 'కర్మ' 1934 లో విడుదలయింది. సాంప్రదాయాలకు పెద్ద పీట వేసే భారత్ లో ఈ చిత్రంలో హిమంశురాయ్, దేవికారాణి ల పై నాలుగు నిముషాల పాటు వుండే ముద్దు దృశ్యం అప్పట్లో సంచలనం రేపింది. ఈ చిత్రంతో భారతీయ ప్రేక్షకులకు కూడా ఆమె కలల రాణి అయిపోయింది. ఈ చిత్రాన్ని, దేవికారాణి అందాన్ని, అభినయాన్ని భారత కోకిల సరోజినీ దేవి ప్రత్యేకంగా ప్రశంసించారు కూడా !

Vol. No. 01 Pub. No. 212

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం