Sunday, February 14, 2010

ప్రత్యక్ష ' డబ్బింగ్ '


ఇతర భాషా చిత్రాలు మన రాష్ట్రంలో విడుదల కావడం మనకు కొత్త కాదు. అలాగే అనువాద చిత్రాలూ మనకి కొత్తకాదు. టాకీలు మొదలైన కొంత కాలానికి గానీ ఇతర భాషల్లోకి అనువాదం చేసే ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈ అనువాదం లేదా డబ్బింగ్ ప్రారంభం కాక ముందు సామాన్య ప్రేక్షకులకు ఆ భాష అర్థం కావడానికి ఆయా థియేటర్ల యజమానులు కొంత కసరత్తు చేసేవారు. ఆ విన్యాసాల్లో ఓ ప్రక్రియ ' ప్రత్యక్షానువాదం '.

ఈ ప్రక్రియ ముఖ్యంగా రెండో శ్రేణి నగరాలలో ఎక్కువగా ఉపయోగించేవారు. ఇంతకీ అదేమిటంటే ఇతర భాష ముఖ్యంగా హిందీ, ఇంగ్లీషు భాషల చిత్రాలు విడుదలయినపుడు తెర వెనుక ఒక వ్యక్తిని కూర్చోబెట్టి ఆ చిత్రం లోని సంభాషణలన్నీ అనువాదం చేసి చెప్పించేవారు. అతను ప్రతి సంభాషణను మక్కికి మక్కి అనువాదం చేసి వినిపించేవాడు. ఒకప్రక్క సినిమాలోని అసలు సంభాషణలు, మరోప్రక్క అనువాదకుని సంభాషణలు కలగలసిపోయి అదొక గందరగోళం.......

1942 లో అశోక్ కుమార్ హీరోగా హిందీలో వచ్చిన ' కిస్మత్ ' సంచలనం సృష్టించింది. కలకత్తాలో సుమారు మూడు సంవత్సరాలు నడిచి చరిత్ర సృష్టించింది. ' షోలే ' వరకూ ఆ రికార్డు అలాగే ఉంది. ఆ చిత్రం విజయవాడలో విడుదలయినపుడు తొలిసారి ఈ ' ప్రత్యక్ష అనువాదం ' లేకుండా నడిపించారు. అప్పటినుండి పర భాషా చిత్రాలు ఆయా భాషల్లోనే చూడడానికి అలవాటు పడ్డారు తెలుగు ప్రేక్షకులు. తమిళం లాంటి ఇతర భాషల చిత్రాలు డబ్బింగ్ చెయ్యడం ఆ తర్వాత ప్రారంభమయ్యింది. హాలీవుడ్ లో విడుదలయిన కొన్ని సంవత్సరాలకు గానీ మనం చూడలేని సినిమాలిప్పుడు నేరుగా మన భాషలోనే విడుదలవుతున్నాయి. ఎప్పుడో విడుదలయిన చిత్రాలు డబ్బింగ్ చేసి విడుదల చెయ్యడంనుంచి, ఇప్పుడు అసలు చిత్రం విడుదలతో బాటు డబ్బింగ్ చిత్రం కూడా విడుదల చేసే స్థితికి చేరుకున్నాం.

అనుబంధం : ప్రత్యక్ష డబ్బింగ్ విషయంలో ప్రత్యక్ష అనుభవం

నేను రాస్తున్న, రాసిన విషయాలన్నీ నా ప్రత్యక్షానుభవాలు కాదు. పెద్దల ద్వారా విన్నవి, పత్రికలు, పుస్తకాలలో చదివినవి క్రోడీకరించి రాస్తున్నవే !
ఈ టపాలో రాసిన విషయంలో ప్రత్యక్షానుభవంగల బ్లాగు మిత్రులు శ్రీ నరసింహ ( వేదుల బాలకృష్ణమూర్తి ) గారు తమ స్వీయానుభవాన్ని వ్యాఖ్య రూపంలో తెలియజేసారు. అది కేవలం వ్యాఖ్య రూపంలో ఉండిపోవడం ఇష్టం లేక ఇందులో అనుబంధంగా చేర్చాను. ఆయన్ని తమ అనుభవాలు, అనుభూతులు ఇంకా వివరంగా తెలియజెయ్యమని కోరడం జరిగింది. అలాగే నేను రాస్తున్న విషయాలలో ప్రత్యక్ష, పరోక్ష అనుభవాలు కలిగిన వారెవరైనా ఆ విషయాలను తెలియజేస్తే బాగుంటుంది. మరింత ఆసక్తికరమైన, విస్తృతమైన సమాచారాన్ని చదువరులకు అందించగలం.
* నరసింహ గారి అనుభవం....................

చిన్నప్పుడు (1963)అంటే పదకొండో క్లాసు పబ్లిక్ పరీక్షలు భీమవరంలో వ్రాసేసాక అక్కడే తాజ్ మహల్ హిందీ సినిమా చూసాం. అప్పుడే మీరు చెప్పిన ప్రత్యక్ష అనువాదం ఆ ధియేటర్లో మొదటిసారిగాను, చివరిసారిగాను కూడా వినటం జరిగింది. అనువాదం చాలా బాగా సాగినట్టు గుర్తు.

* గతంలో సి. బి. రావు గారి టపా డేరా సినిమా లో Mike Dubbing చూడండి.


Vol. No. 01 Pub. No. 196

5 comments:

Unknown said...

చిన్నప్పుడు (1963)అంటే పదకొండో క్లాసు పబ్లిక్ పరీక్షలు భీమవరంలో వ్రాసేసాక అక్కడే తాజ్ మహల్ హిందీ సినిమా చూసాం. అప్పుడే మీరు చెప్పిన ప్రత్యక్ష అనువాదం ఆ ధియేటర్లో మొదటిసారిగాను, చివరిసారిగాను కూడా వినటం జరిగింది. అనువాదం చాలా బాగా సాగినట్టు గుర్తు. మంచివిషయం గుర్తు చేసారు. ధన్యవాదాలు.

జయ said...

ఇదేదొ గమ్మత్తుగా ఉందండి. అలా ఇప్పుడు చూస్తే ఎలా ఉంటుందో! మీరు అన్నీ ఎప్పటి విషయాలో చాలా బాగా చెప్తున్నారు.

Saahitya Abhimaani said...

గూగుల్ బజ్ లో కామెంటు వ్రాస్తే ఇక్కడకు రావటంలేదు.

బాగున్నది మాష్టారూ, మీరిచ్చిన సమాచారం. ఆ సినమా అలా లైవ్ అనువాదంతో విన్న వాళ్ళెవరైనా ఉండి తమ అనుభవం చెప్తే బాగుంటుంది. కాని ఎవరుంటారు అప్పటివాళ్ళు.

మనం దూరదర్శన్ లో మధ్యాహ్నం ఒంటిగంటకు, ఒక రెండు దశాబ్దాలక్రితం, అవార్డు పొందిన ప్రాంతీయ చిత్రాలను చూసేవాళ్ళం. అటు సంభాషణలు అదేదో భషలో వస్తుంటే, బొమ్మ చూస్తూ, కింద వస్తున్న ఆంగ్ల తర్జుమా చూసి సినిమాను ఆనందించేవాళ్ళం. ఇదికూడ కొంత అభ్యాసం చేసినమీదటకాని మనకు అలవడలేదు ఆరోజులలో. అలాగే పర భాషా చిత్రాలను మనకు అందించటంలో అప్పటి నిర్మాతలు, చిత్రశాల నిర్వాహకులు కొత్త పుంతలు తొక్కారు. డబ్బింగుకు ముందు పరిస్తితి ఇది.

SRRao said...

* నరసింహ గారూ !
చాలా సంతోషం. మీ అనుభవాన్ని తెలిపినందుకు. నాకు ప్రత్యక్షంగా అనుభవం లేకున్నా, విన్నది, చదివినది రాసాను. శివగారు తమ వ్యాఖ్యలో రాసినట్లు వీలైతే మీ ప్రత్యక్షానుభవాన్ని వివరంగా తెలియజెయ్యండి. మీ వ్యాఖ్యను నా టపాకు అనుబంధంగా ప్రచురిస్తున్నాను. గమనించగలరు. మంచి విషయాన్ని తెలిపినందుకు కృతజ్ఞతలు.

* జయగారూ !
అవునండీ ! ఇంకా చాలా గమ్మత్తులున్నాయి. ఇప్పుడు చూస్తే ఎలాగుంటుందోనన్న మీ ఆలోచన బాగుంది. ధన్యవాదాలు.

* శివగారూ !
ధన్యవాదాలు. నరసింహ గారి వ్యాఖ్యలో ఆయన స్వీయానుభవం రాసారు. చూసారా ? లేకపోతే నా అనుబంధ టపాగా ప్రచురిస్తున్నాను. చూడండి. ఆయన ఇంకా వివరంగా చెప్తే మళ్ళీ అప్ డేట్ చేస్తాను.

SRRao said...

రావు గారూ !
కృతజ్ఞతలు. మీ లింకు నా టపాలో కలిపాను.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం