Tuesday, January 19, 2010

దత్తపది


మహాకవి శ్రీశ్రీ పద్మనాభం నిర్మించిన
' కథానాయిక
మొల్ల ' చిత్రంలో రాసిన ఒక పద్యం.

సందర్భం : శ్రీకృష్ణ దేవరాయల వారు తెనాలి రామకృష్ణుడిని కవయిత్రి మొల్ల కవితా పాటవాన్ని పరీక్షించడానికి పంపిస్తారు. రామకృష్ణుడు మొల్లకు ఒక సమస్య ఇస్తాడు.

సమస్య : ' అప్పు, నిప్పు, మెప్పు, చెప్పు ' అనే నాలుగు మాటలుపయోగించి రామాయణ పరంగా వచ్చేటట్లు ఒక పద్యం చెప్పమంటాడు. మొల్ల చెప్పబోతోంటే ఇంకో షరతు విధిస్తాడు. ' ఆ పద్యంలో అప్పు అంటే ఋణం అని, నిప్పు అంటే అగ్ని అని, మెప్పు అంటే ప్రశంస అని, చెప్పు అంటే పాదరక్ష అని అర్థాలు రాకూడదు ' అని ఆ షరతు.
ఆ నియమాలు తప్పకుండా కవయిత్రి మొల్ల చెప్పిన కంద పద్యం .........

అప్పుడు మిథిలకు జని నే
నిప్పుడు కావించు వింత నిచ్చటి ప్రజ తా
మెప్పుడును కాంచబోరని
చెప్పుచు రాఘవుడు విరిచె శివకార్ముకమున్

ఇంతవరకూ ' కథానాయిక మొల్ల ' చిత్రంలో ఉంటుంది. కానీ శ్రీశ్రీ గారు దాన్ని పొడిగిస్తూ తన ' పాడవోయి భారతీయుడా ' సంకలనంలో ఇలా అంటారు.

" చాలా తేలికగా ఒక కంద పద్యం చెప్పేశావు గాని ఇదే అర్థంతో ఒక ఉత్పలమాల చెప్పమ్మాయి " అని రామలింగడు అడిగాడనుకుందాము. అప్పుడామె చెప్పే పద్యం --

అప్పుడు ఖ్యాతి గన్న మిథిలాఖ్య పురంబున చేరనేగి, నే
నిప్పుడు చేయు వింత నెవరేనియుజీవిత కాలంమందు తా
మెప్పుడుగాని చూడరని యెంతయు సంతసమార, ధీరుడై
చెప్పుచు రాఘవుండు విరిచెన్ శివకార్ముక మద్భుతంబుగన్

Vol. No. 01 Pub. No. 162

3 comments:

ఊకదంపుడు said...

ఈ పుస్తకం ఒక్కప్పుడు నా దగ్గర కూడ ఉండేదండీ... అందులో "Somehow" కందము రాసితి అని బిందుపూర్వహ హ కార ప్రాస కంద పద్యం కూడా ఉంటుంది.
మంచి విషయం గుర్తు చేశారు

SRRao said...

ఊ.దం. గారూ !
ధన్యవాదాలు.

ఊకదంపుడు said...

అయ్యో, ఈ టపా ప్రచురించినందుకు నేనే మీకు ధన్యవాదాలు చెప్పాలండీ, మీరు నాకు కాదు.
మీరు ఇప్పటి వరకు ప్రకటించిన టపాలకు, ఇక ముందు ప్రచురించబోయే టపాలకు కలిపి టోకుగా ఇవే నా ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం