Saturday, November 21, 2009

ఎన్నికల ' ప్రచారం '

ప్రస్తుతం ఎన్నికల ప్రచారాల తీరుతెన్నులు ఎలా ఉంటున్నాయో ప్రత్యేకంగా వివరించనక్కరలేదు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అన్నట్లు తమ సంగతి మర్చిపోయి ఎదుటి అభ్యర్థి మీదో, పార్టీ మీదో ఎంత బురద జల్లితే అంత బాగా ప్రచారం చేసినట్లుగా భావిస్తున్నారు. ఒక్కోసారి… ఒక్కోసారి ఏమిటి లెండి ! చాలాసార్లు ఆ భాష వినడం కష్టంగా ఉంటోంది. కాబోయే ప్రభుత్వా ధినేతలు… గట్టిగా మనమేదైనా అంటే రేపొద్దున్న పీఠం ఎక్కాక ఆ భాషనే అధికార భాషగా ప్రకటించెయ్యవచ్చు. అందుకని ఆ ఎన్నికలు పూర్తయేదాకా నోర్మూసుకుని … కాదు.. కాదు.. చెవులు మూసుకుని ఉండడం ఉత్తమమేమో ! ప్రస్తుత పరిస్థితులు అలా ఉంటే గత కాలంలో ఎన్నికల ప్రచారాలెలా ఉండేవో మచ్చుకు ఒక సంఘటన………
చెరుకువాడ నరసింహం గారని గొప్ప జాతీయవాది. ఆయన ఉపన్యాసాలు వ్యంగ్యంతో నిండి అవసరమైన చోట్ల చురకలతో వినోదాత్మకంగా సాగుతూ అందర్నీ అలరిస్తూ ఉండేవి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఆయన ప్రచార ప్రసంగం చేస్తే ఆ అభ్యర్థి విజయం తథ్యమని నమ్మేవారు. ఎదుటి ఆభ్యర్థులపై ఆయన వేసే సున్నితమైన చురకలు ఓటర్ల మనసులలో చురకత్తుల్లా గుచ్చుకునేవి. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఉండేది.
• ఒకసారి ఎన్నికలలో ఒక అభ్యర్థి తరఫున ప్రచారం చెయ్యవలసి వచ్చింది. అప్పుడక్కడ పోటీ తీవ్రంగా ఉంది. సరే ! ఈయన ప్రచార సభలో ప్రసంగం ప్రారంభించారు. అందరూ ఊహించినదానికి భిన్నంగా " మా గురించి మేము చెప్పుకోవడం అంత బాగుండదేమో ! అందుకే మా ప్రత్యర్థి గురించి రెండు ముక్కలు చెబుతాను. ఎందుకంటే అతను నాకు చిన్నప్పట్నుంచీ తెలుసు. ఒకసారి ఏం జరిగిందంటే, అప్పుడు అతను రెండో తరగతో, మూడో తరగతో చదువుతున్నట్లున్నాడు, వాళ్ళమ్మ ఒక అణా ఇచ్చి కరివేపాకు తెమ్మంది. కొట్టుకి వెళ్ళాక అతనికి శనగపప్పు తినాలనిపించింది. అంతే ! అమ్మ ఇచ్చిన డబ్బులతో శనగపప్పు కొనుక్కుని తినేసాడు. ఇంటికి వెళ్ళి అమ్మకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అంతే ! సరాసరి వెళ్ళి ఆ ప్రతి పక్ష పార్టీలో చేరిపోయాడు. అదీ సంగతి. ఇక ఓటు ఎవరికి వెయ్యాలో మీ ఇష్టం " అని ముగించారు.

• సరే ! అది తమ పార్టీకే చెందిన వేరే అభ్యర్థి గురించి చేసిన ప్రచారమైతే ఒకసారి ఆయనే స్వయంగా ఎన్నికలలో పోటీ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆయనే స్వయంగా చేసుకునే ప్రచారోపన్యాసం ఎలా ఉంటుందో ఊహించండి. ఇదిగో ఇలా …….

" అయ్యా ! ఇంతకాలం మంత్రసానితనం చేస్తున్నాను. కానీ ఇప్పుడు ఆ మంత్రసానే ప్రసవించడానికి సిద్ధంగా ఉంది. అందులోనూ ఇప్పుడు ఈ ముసలి వయసులో….. " అంటూ సాగింది.

Vol. No. 01 Pub. No. 117

2 comments:

సూర్యుడు said...

పూర్వం అసెంబ్లీ సమావేశాల్లోకూడా చాలా చక్కగా మాట్లాడేవారు, ఒక్క రాజకీయనాయకుల్ననుకుని ప్రయోజనంలేదు, అన్ని చోట్లా తెలుగు పరిస్థితదే!

SRRao said...

సూర్యుడు గారూ !
అదీ నిజమేనండీ ! మీ వ్యాఖ్యకి అభినందనలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం