Sunday, November 8, 2009

మెరుపు మెరిసింది

వర్షం, వర్షం
పగలల్లా వర్షం
రాత్రయింది
ఇంకా వర్షం
నీరజకు నిద్ర రాదు
ముప్పయ్యయిదేళ్ళ జీవితం
వ్యర్థం, వ్యర్థం
జీవితమంతా వ్యర్థం
మెరుపులు, మెరుపులు
వ్యర్థం, వ్యర్థం
----------------------
శక్తిలేదు,ఆరోగ్యం లేదు, ఒపిక లేదు
ఇల్లు లేదు, తిండీలేదు, బట్టలేదు, భర్త లేడు
యవ్వనం లేదు
అలనాటి యవ్వనం అప్పుడే పోయింది
అలనాటి చెలికాడు ఆనాడే పోయేడు
అదంతే
ఇదింతే
అదో మెరుపు, ఇదో మెరుపు, మరో మెరుపు
ఒకటీ, రెండూ, మూడూ
హాస్యాస్పదం నవ్విపోతారు
మెరుపులు మెరుపులు ఆశల మెరుపులు
అదిగో మెరుపు
ఇదే మాయమయింది
మళ్ళీ మెరిసింది
మాయమయింది
ఇంతే ఇదే
ఆఖరి కిదే నిజం
ఈ చీకటే ఇదే ఈ చీకటే నిజం
ఇలా ఉండవలసిందే తను
ఏకాకిగా, నిరాశతో,
నీరజ స్కూలికి వెళ్తుంది
నీరజ స్కూలునుంచి వస్తుంది
వయసు వెళ్తుంది
చావు వస్తుంది
అదిగో మెరుపు మెరిసింది
అప్పుడే మాయమయింది
ఆఖరి కింతే
ఈ అంధకారంలో ఇలా వంటరిగా, నిరాశతో, దారిద్ర్యంతో, బాధతో, వర్షంలో, చలితో, తడితో, చింకి గొడుగుతో, వంటరిగా... వంటరిగా .... వంట...రిగా.....వం...ట...రి...గా...
మెరుపు మెరిసింది
మాయమయింది
-----------------------------------------
నీరజ వంటరి జీవి , అవివాహిత. ఆమెకు అడుగడుగునా ఆశాభంగమే ! ప్రేమించిన చెలికాడు ఎప్పుడో దూరమయ్యాడు. ఆమె గురించి పట్టించుకునే వారెవరూ లేరు. ఆమె జీవితం అడవి కాచిన వెన్నెల. ఒక సగటు మహిళ అంతరంగంలోని అలోచనా తరంగాలను మన కళ్ళెదుట సాక్షాత్కరింపజేస్తారు రావిశాస్త్రి గారు. ఆయన విలక్షణ శైలి కిదో మచ్చు తునక.

2 comments:

భావన said...

బాగుందండి బలే పరిచయం చేస్తున్నారే రావి శాస్త్రి గారి కధలన్ని. అన్నీ ' కధలు ' అనే పుస్తకం లోనివా? రావిశాస్త్రి గారి 'ఇల్లు' ఒక్కటే చదివేను నేను. మంచి పరిచయాలు.

SRRao said...

భావన గారూ !
ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందిన ' రాచకొండ విశ్వనాథ శాస్త్రి కథలు ' పుస్తకంలోనివి. మీకు నచ్చినందుకు సంతోషం. రావిశాస్త్రి గారనగానే గుర్తుకొచ్చేది ఆయన సారాకథలు మాత్రమే ! కానీ ఎన్నో అద్భుతమైన కథలు రాసారాయన. మీకు నచ్చుతున్నందుకు సంతోషం.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం