Saturday, November 28, 2009

అపర భగీరథుడు

ఒకామె తన కూతురు, చిన్న కొడుకులతో నడుచుకుంటూ వెడుతోంది. రోడ్డు ప్రక్కన ప్రవహిస్తున్న మురుగు కాలవలో నీళ్లు రక్తం రంగులో ఎర్రగా కనిపించాయి. అది చూసి వాళ్లు ఆశ్చర్య పోయారు. నీళ్ళకు రంగెలా వచ్చిందో వారికి అర్థం కాలేదు. అకస్మాత్తుగా చిన్నబాబు అదృశ్యమయ్యాడు. కొన్ని గంటల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన పిల్లవాడు తన పరిశోధన విశేషాలు వివరించాడు, మురుగు కాలవలో నీటికి రంగు రావడానికి కారణం అక్కడకు కొద్ది దూరంలో ఉన్న రంగుల అద్దకం పరిశ్రమ అని.
అక్షరాలు నేర్చుకుంటున్న వయస్సులో తినడానికిచ్చిన రొట్టెను గట్లుగా పేర్చి తాగడానికిచ్చిన పాలను వాటిలో పోస్తూ ఆడుకునేవాడు. అదేమిటని అడిగితే కాలవలు కడుతున్నానని సమాధానం.
వర్షం కురుస్తున్న రోజుల్లో బయిటకు వెడితే తన దగ్గరున్న చేతికర్రతో రోడ్డుమీద ప్రవహిస్తున్న వర్షపు నీటిని సక్రమంగా మురుగునీటి కాలవలోకి ప్రవహించేటట్లు దారి చేస్తుండేవాడు.
పువ్వు పుట్టగానే పరిమళించినట్లు చిన్నప్పుడే నీటి పారుదల పైన అవగాహన పెంచుకున్న ఆ పిల్లవాడు మన ఆంధ్ర దేశాన్ని సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు జనరల్ సర్ ఆర్థర్ కాటన్. సమాజహితాన్ని కోరేవారికి దేశం, ప్రాంతం, భాష, జాతి, మతం, కులం లాంటివేవీ అద్దంకి కాదని నిరూపించిన మహనీయుడు. వృధాగా సముద్రం పాలవుతున్న నదీజలాలకు అడ్డుకట్ట కట్టి వాటిని పొలాల్లోకి మళ్ళించి లక్షలాది ఎకరాల భూముల్ని సస్యశ్యామలం చేసిన కాటన్ ను భారత నీటి పారుదలా వ్యవస్థ పితామహుడిగా పేర్కొంటారు.
1844 లో రాజమండ్రికి చర్చి నిర్మాణం నిమిత్తం వచ్చిన కాటన్ అక్కడ గోదావరి పరీవాహక ప్రాంతాల పరిస్థితిని చూసి ఆ నదీజలాలను సరైన పద్ధతిలో వాడుకుంటే వచ్చే ప్రయోజనాలను గుర్తించాడు. దాని మీద ఒక సమగ్ర నివేదిక రూపొందించి గోదావరి నదిపైన ఆనకట్ట ఆవశ్యకతను ప్రభుత్వానికి తెలియజేసాడు. దీని వలన రైతులు సగం ఖర్చు, శ్రమ తోనే రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చనేది ఆయన వాదన. బ్రిటిష్ ప్రభుత్వాదికారుల్ని వప్పించి ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట నిర్మించాడు. దానికి అనుబంధంగా అనేక కాలవలు, రోడ్లు, వరదనష్టాల్ని తగ్గించడానికి ఏటిగట్లు పటిష్ట పరచడం లాంటి ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు చేసాడు. అప్పటివరకూ పరీవాహక ప్రాంతాల ప్రజలకు దు:ఖదాయనిగా ఉన్న గోదావరి అన్నపూర్ణగా మారిపోయింది. అప్పటివరకూ అది రాజమండ్రి జిల్లా ! అప్పటినుంచి గోదావరి జిల్లాగా మారిపోయింది !! గోదావరి డెల్టా వాసులకు అతడు ఆరాధ్య దైవం. అందుకే వారికి అతడు కాటన్ కాదు, కాటన్న. కోనసీమలోని ప్రతి ఉళ్లోనూ కాటన్నలున్నారు. అతడు కృష్ణానది పరీవాహక ప్రాంతానికి చేసిన సేవ కూడా అనుపమానమైనదే ! బెజవాడలోనకట్ట నిర్మాణం ఆయన చలవే ! ఈనాడు ఆంధ్ర దేశం అన్నపూర్ణ గా ఖ్యాతిగాంచడానికి కాటన్ కారకుడనడంలో సందేహం లేదు. సముద్రం పాలవుతున్న నదీ జలాలను పొలాల్లోకి మళ్లించిన అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్.
( సర్ ఆర్థర్ కాటన్ మునిమనమడు రాబర్ట్ చార్లెస్ కాటన్ దంపతులు మన రాష్ట్రంలో పర్యటిస్తున్న సందర్భంగా...... )

Vol. No. 01 Pub. No. 121

ఈద్ ముబారక్

త్యాగాల పండుగ బక్రీద్

ముస్లిం సోదర సోదరీమణులందరికీ
బక్రీద్ శుభాకాంక్షలు



Vol. No. 01 Pub. No. 120

Friday, November 27, 2009

నవ్వులరేడు

అతడు కదిలితే నవ్వుల వాన
అతడు మెదిలితే దరహాసాల జడి
అతని మాట హాస్యపు గుళిక
అతని పాట గిలిగింతల మాలిక
అతడే రేలంగి
కొంటె నవ్వుల కోణంగి
( నిన్న- నవంబరు 26 - రేలంగి వర్థంతి సందర్భంగా ఆ నవ్వుల రేడుకు నివాళులర్పిస్తూ.... )



Vol. No. 01 Pub. No. 119

Monday, November 23, 2009

జాబితాలో చోటు


హాస్య కవులు, రచయితలు ప్రతి సందర్భంలోనూ హాస్యం ఒలికించగలరు. ఓసారి కాకినాడలో తూర్పుగోదావరిజిల్లా రచయితల మహాసభలు జరుగుతున్నాయి. ఆ రోజు సభలలోని అంశాలన్నీ పూర్తయ్యాయి ఒక్క సంతాప తీర్మాన కార్యక్రమం తప్ప. అది మొదలయ్యేటప్పటికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. ఆ సంవత్సరం మరణించిన ప్రపంచ కవులందరికీ సంతాపాలు ప్రకటిస్తున్నారు. అంతకంతకూ జాబితా పెరిగిపోతోంది. ఆ సభకు ప్రముఖ రచయిత మొక్కపాటి నరసింహశాస్త్రి గారు అధ్యక్షత వహించారు. ఆయన చాలా సేపు ఓపిక పట్టారు. ఇక ఆగలేక ఆ జాబితా తయారుచేస్తున్న వారితో " సభ ముగిద్దామంటే మీరు వినకుండా ఇప్పుడు దివంగత పెద్దల జాబితా తయారుచేస్తున్నారు. వంటలు అయిపోయాయి. పదార్థాలన్నీ చల్లారిపోతున్నాయి. మీరింకా ఆలస్యం చేస్తే ఆ దివంగతుల జాబితాలో నా పేరు కూడా చేర్చాల్సి ఉంటుంది " అన్నారు, అలా తన ఆకలి కోపాన్ని హాస్యంగా పలికిస్తూ !

Vol. No. 01 Pub. No. 118

Saturday, November 21, 2009

ఎన్నికల ' ప్రచారం '

ప్రస్తుతం ఎన్నికల ప్రచారాల తీరుతెన్నులు ఎలా ఉంటున్నాయో ప్రత్యేకంగా వివరించనక్కరలేదు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అన్నట్లు తమ సంగతి మర్చిపోయి ఎదుటి అభ్యర్థి మీదో, పార్టీ మీదో ఎంత బురద జల్లితే అంత బాగా ప్రచారం చేసినట్లుగా భావిస్తున్నారు. ఒక్కోసారి… ఒక్కోసారి ఏమిటి లెండి ! చాలాసార్లు ఆ భాష వినడం కష్టంగా ఉంటోంది. కాబోయే ప్రభుత్వా ధినేతలు… గట్టిగా మనమేదైనా అంటే రేపొద్దున్న పీఠం ఎక్కాక ఆ భాషనే అధికార భాషగా ప్రకటించెయ్యవచ్చు. అందుకని ఆ ఎన్నికలు పూర్తయేదాకా నోర్మూసుకుని … కాదు.. కాదు.. చెవులు మూసుకుని ఉండడం ఉత్తమమేమో ! ప్రస్తుత పరిస్థితులు అలా ఉంటే గత కాలంలో ఎన్నికల ప్రచారాలెలా ఉండేవో మచ్చుకు ఒక సంఘటన………
చెరుకువాడ నరసింహం గారని గొప్ప జాతీయవాది. ఆయన ఉపన్యాసాలు వ్యంగ్యంతో నిండి అవసరమైన చోట్ల చురకలతో వినోదాత్మకంగా సాగుతూ అందర్నీ అలరిస్తూ ఉండేవి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఆయన ప్రచార ప్రసంగం చేస్తే ఆ అభ్యర్థి విజయం తథ్యమని నమ్మేవారు. ఎదుటి ఆభ్యర్థులపై ఆయన వేసే సున్నితమైన చురకలు ఓటర్ల మనసులలో చురకత్తుల్లా గుచ్చుకునేవి. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఉండేది.
• ఒకసారి ఎన్నికలలో ఒక అభ్యర్థి తరఫున ప్రచారం చెయ్యవలసి వచ్చింది. అప్పుడక్కడ పోటీ తీవ్రంగా ఉంది. సరే ! ఈయన ప్రచార సభలో ప్రసంగం ప్రారంభించారు. అందరూ ఊహించినదానికి భిన్నంగా " మా గురించి మేము చెప్పుకోవడం అంత బాగుండదేమో ! అందుకే మా ప్రత్యర్థి గురించి రెండు ముక్కలు చెబుతాను. ఎందుకంటే అతను నాకు చిన్నప్పట్నుంచీ తెలుసు. ఒకసారి ఏం జరిగిందంటే, అప్పుడు అతను రెండో తరగతో, మూడో తరగతో చదువుతున్నట్లున్నాడు, వాళ్ళమ్మ ఒక అణా ఇచ్చి కరివేపాకు తెమ్మంది. కొట్టుకి వెళ్ళాక అతనికి శనగపప్పు తినాలనిపించింది. అంతే ! అమ్మ ఇచ్చిన డబ్బులతో శనగపప్పు కొనుక్కుని తినేసాడు. ఇంటికి వెళ్ళి అమ్మకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అంతే ! సరాసరి వెళ్ళి ఆ ప్రతి పక్ష పార్టీలో చేరిపోయాడు. అదీ సంగతి. ఇక ఓటు ఎవరికి వెయ్యాలో మీ ఇష్టం " అని ముగించారు.

• సరే ! అది తమ పార్టీకే చెందిన వేరే అభ్యర్థి గురించి చేసిన ప్రచారమైతే ఒకసారి ఆయనే స్వయంగా ఎన్నికలలో పోటీ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆయనే స్వయంగా చేసుకునే ప్రచారోపన్యాసం ఎలా ఉంటుందో ఊహించండి. ఇదిగో ఇలా …….

" అయ్యా ! ఇంతకాలం మంత్రసానితనం చేస్తున్నాను. కానీ ఇప్పుడు ఆ మంత్రసానే ప్రసవించడానికి సిద్ధంగా ఉంది. అందులోనూ ఇప్పుడు ఈ ముసలి వయసులో….. " అంటూ సాగింది.

Vol. No. 01 Pub. No. 117

కనుక్కోండి చూద్దాం ! - 5

పల్నాటి యుద్ధం కథ చెబుతున్న ఈ స్వరం ఎవరిదో చెప్పగలరా ?



Vol. No. 01 Pub. No. 116

Friday, November 20, 2009

ఆంధ్రప్రదేశ్ లో మొదటి మహిళా సౌరశక్తి ఇంజనీర్లు

" కృషి ఉంటే మనుష్యులు ఋషులవుతారు " కొంచెం ప్రేరణ, ప్రోత్సాహం ఉంటే ఏపని నేర్చుకోవడానికైనా విద్య, ఆర్ధిక పరిస్థితి, లింగ బేధాలు వగైరా అడ్డంకి కాదు. పట్టుదల, కృషి ఉంటే చాలని నిరూపిస్తూ మహిళా సాధికారతకు దర్పణమైన ఈ వీడియో చూడండి.


Vol. No. 01 Pub. No. 115

Thursday, November 19, 2009

అప్రస్తుత ప్రసంగం

ఆంధ్రులకు ప్రత్యేకమైన సాహితీ ప్రక్రియ అవధానం. ఇది పూర్తిగా ధారణ మీద ఆధారపడి ఉంది. అందులొ అప్రస్తుత ప్రసంగం విలక్షణమైనది. అవధాని ఏకాగ్రతను భంగం చెయ్యడమే దాని లక్ష్యం. అలాంటి అప్రస్తుత ప్రసంగానికి
అవధానులిచ్చిన చమత్కారమైన సమాధానాలు కొన్ని చూడండి.

* ఓ అవధానిగారికి నెత్తి మీద జుట్టు పల్చగా ఉంటుంది. ఆయనకు దాన్ని మాటి మాటికీ దువ్వుకోవడం అలవాటు.
అది చూసిన అప్రస్తుత ప్రసంగం వారు ఆ అవధానిని ఆట పట్టిస్తూ ' ఆ వున్న నాలుగు పుంజీల వెంట్రుకలు మాటి మాటికీ దువ్వాలేమిటి ? ' అని ఆక్షేపించాడు.
దానికా అవధాని గారు " నీకేం తెలుస్తుంది నాయనా నా బాధ ! నలభై ఎకరాలున్న వాడు ఎలా ఖర్చు పెట్టుకున్నా ఫర్వాలేదు. నాలుగు ఎకరాలే ఉన్నవాడు కొంచెం వెనుకా ముందూ ఆలోచించి జాగ్రత్తగా ఆ ఉన్న వాటిని కాపాడుకోవాలి. నా పరిస్థితీ అంతే ! " అన్నారు.

* " అయ్యా ! నాకో శుభలేఖ వచ్చింది. కీర్తిశేషులిద్దరు పెళ్ళి చేసుకుంటున్నారు. నన్ను రమ్మని ఆహ్వానించారు. వెళ్ళమంటారా ? " అని అడిగాడొక పృచ్చకుడు ఒక అవధానంలో .
దానికి సమాధానంగా అవధానిగారు " తప్పకుండా వెళ్ళండి" అని ఆగారు. అందరూ ఆశ్చర్య పోయారు. ఏమిటీయన
కీర్తిశేషుల పెళ్ళీ అంటే వెళ్ళమంటాడు. స్వర్గానికి వెళ్ళమనా అని అందరూ అనుకుంటుండగా ' అమ్మాయి పేరు కీర్తి. అబ్బాయి పేరు శేషు. వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకుంటుంటే వెళ్ళడానికి మీకభ్యంతరం ఏమిటి ? "
అనగానే అందరూ నవ్వుల్లో మునిగిపోయారు.

( ప్రముఖ అవధాని డా. గరికపాటి నరసింహారావు గారు చెప్పిన సంగతులివి )

Vol. No. 01 Pub. No. 114

సరస్వతి వారోత్సవాలు

పుస్తకం సరస్వతీ దేవి ప్రతిరూపం. పుస్తకాలు జ్ఞాన దీపాలు. వాటిని పరిరక్షించడం , అందరికీ అందుబాటులోకి తేవడం, భావి తరాలకు అందించడం ఇవన్నీ ఒక ఉద్యమంగా ప్రారంభమైంది 1914 నవంబరు 14 తేదీన. రోజు మద్రాస్ లో అయ్యంకి వెంకట రమణయ్య గారి ఆధ్వర్యంలో అఖిల భారత స్థాయి మహాసభలు జరిగాయి. సభలో గ్రంధాలయోద్యమానికి అంకురార్పణ జరిగింది. ఫలితంగా అఖిల భారత పౌర గ్రంధాలయ సంఘం ఏర్పాటయింది.
స్వాతంత్ర్య పోరాటంలో జైలు కెళ్ళిన తొలి ఆంధ్రుడుగా ఘనత వహించిన గాడిచర్ల హరి సర్వోతమరావుగారు ఆంధ్ర గ్రంధాలయ సంఘం అధ్యక్షులుగా 1934 నుండి ఆయన పూర్తి జీవిత కాలం 1960 వరకూ ఉన్నారు. పాతూరి నాగభూషణంగారు షుమారు 40 సంవత్సరాలు కార్యదర్శిగా పనిచేశారు. గ్రంధాలయోద్యమ ఆవిర్భావానికి గుర్తుగా ప్రతీ సంవత్సరం నవంబరు 14 వతేదీ నుండి 20 తేదీ వరకూ గ్రంధాలయ వారోత్సవాలు జరపాలని 1968 లో నిర్ణయించారు.
గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారి పేరు మీద విజయవాడలో వెలిసిన సర్వోత్తమ గ్రంధాలయంలో వారోత్సవాలు జరుగుతున్నాయి. మొదటి రోజు నగరంలోని పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతి ప్రదానోత్సవం నిన్న ( 18 తేదీ ) జరిగింది. ముఖ్య అతిథిగా నగరపాలక సంస్థ కమీషనర్ శ్రీ ప్రద్యుమ్న పాల్గొన్నారు. కార్యక్రమాన్ని గ్రంధాలయ కమిటీ కార్యదర్శి డా. రావి శారద నిర్వహించారు.







Vol. No. 01 Pub. No. 113
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం