Friday, October 9, 2009

ప్రజలు గొర్రెల మందలా ?

ఉద్యమాలన్నీ సాధారణంగా ఉన్నతమైన ధ్యేయాలతోనే ప్రారంభిస్తారు. భాదిత వర్గంనుంచే ఉద్యమాలు పుడతాయి. కాకపోతే క్రమేణా అందులో రాజకీయనాయకులు ప్రవేశిస్తారు. తమ రాజకీయ లబ్ధికి అనుకూలంగా వాటిని మలుచుకుంటారు. దాంతో ఉద్యమ ధ్యేయం ప్రక్కకేళ్ళిపోతుంది. ప్రారంభించినవారు అయోమయంలో పడిపోతారు. నెమ్మదిగా ఉద్యమం నీరసించిపోతుంది. మరుగునపడిపోయామనుకున్న రాజకీయ నాయకులకి మళ్ళీ జీవం ఇస్తుంది. ఉద్యమ పునాదులపైన కొంతమంది కొత్త రాజకీయనాయకులు పుట్టుకొస్తారు . ఉమ్మడి మదరాసు రాష్ట్రం నుండి ప్రత్యేక ఆంద్ర రాష్ట్రసాధన కోసం నిరాహారదీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములుకి ఇప్పటి రాజకీయనాయకులకున్న తెలివితేటలు లేవనుకుంటా ! ఉంటే 58 రోజులు నిరాహారదీక్ష చేసేవాడుకాదు. వారం రోజులో చేసి పెద్దల్ని రప్పించుకుని తన రాజకీయ ప్రయోజనాలపైన స్పష్టమైన హామీలను పొంది నిమ్మరసం తాగేసేవారు. ఉద్యమ ఉద్దేశాలను గంగలో కలిపేసేవారు.అప్పుడు ఆంద్ర రాష్ట్రం ఇవ్వాల్సిన అవసరం ఉండేదికాదు. గుంటూరులో అమృతరావు అనే వ్యక్తి గురించి చాలా మందికి తెలియక పోవచ్చు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం జరిగిన ఉద్యమంలో నిరాహారదీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి. పెద్ద ఉక్కు కర్మాగారం వచ్చినా ఆతన్ని మాత్రం మరిచిపోయాం. దానికి కారణం బహుశా అతను రాజకీయనాయకుడు కాకపోవడమేనేమో! ప్రజలలోంచి పుట్టిన ఉద్యమాల పరిస్థితే ఇలాఉంటే ఇక రాజకీయనాయకులు ప్రారంభించిన ఉద్యమాలేలా ఉంటాయో ప్రస్తుత తెలంగాణా ఉద్యమాన్ని చూసి తెలుసుకోవచ్చు. దాన్ని కే.సి.ఆర్. ఎన్ని మలుపులు తిప్పాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మరో మలుపు. ఉద్యమాల మీద, ముఖ్యంగా రాజకీయ నాయకుల నాయకత్వం మీద ప్రజలకు విశాసం పోయిందనేది మొన్నటి ఎన్నికలు నిరూపించాయి. నిజానికి తమకు కావలిసింది మౌలిక సదుపాయాలేగానీ రాష్ట్రంలో ఉన్నామనేది కాదని నిరూపించారు. ఎంతగా ప్రాంతీయ బేధాలను రెచ్చగొట్టినా పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్త పల్లవి వినిపిస్తోంది. అదే కులబేదాలు. మహాత్మా గాందీ కులమేమిటో ప్రజలేవరూ పట్టించుకోలేదు. ఆయనా పట్టించుకున్న దాఖలాలు చరిత్రలో ఎక్కడా కనబడవు. ఇంతకాలం తర్వాత రోశయ్యగారి పుణ్యమాని కే.సి.ఆర్. ప్రజలకు గుర్తుచేస్తున్నారు. ప్రజలు తమ శక్తి ఏమిటో అంత స్పష్టంగా చెప్పినా ఇంకా అర్థం కాకపోవడం అతని అజ్ఞానమా? కాదు. ప్రజల జ్ఞాపకశక్తి మీద అతనికున్న అపార నమ్మకం, త్వరలోనే అన్నీ మర్చిపోతారని. ప్రజలు గొర్రెల మందని అతని నిశ్చితాభిప్రాయం. దాదాపుగా రాజకీయనాయకులందరి అభిప్రాయం కూడా అదేననుకోండి. ప్రాంతీయ బేధం అంతగా పని చెయ్యలేదు. ఇప్పుడీ కులాల్ని అడ్డుపెట్టుకుని కొంతమందినైనా కదిపితే మళ్ళీ అందరూ నెమ్మదిగా తన వెనుక వచ్చేస్తారనే భావన కే.సి.ఆర్. కి ఉందనుకుంటా !
ఎన్నికల్లో పోటీ చేయడానికి దేశంలోని ప్రతి పౌరుడూ రాజ్యాంగం ప్రకారం అర్హుడే ! కానీ రాజకీయాలు ప్రస్తుతం డబ్బూ, పలుకుబడి, కులం, దాదాగిరి అనే వాటి చుట్టూ తిరుగుతున్నాయి. అవే నిజమైన ప్రజాసేవకుల్ని రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నాయి. అవకాశాన్ని వ్యవస్థ కల్పించదు. కనుక దీనికున్న ఒకే ఒక పరిష్కారం ప్రస్తుతమున్న రాజకీయ పార్టీలను పట్టించుకోకుండా ప్రజాసేవ చెయ్యాలనే తలంపు ఉన్న ప్రతి ఒక్కరూ స్వతంత్రులుగా ఎన్నికలలో పోటీ చేసి గెలిచి తర్వాత కలిసికట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడమే ! లేకపోతే మళ్ళీ మళ్ళీ వీళ్ళే పోటీ చేస్తుంటారు. వీళ్ళలోనే ఎవరో ఒకరిని ఎన్నుకోక తప్పనిపరిస్థితి. కానీ అలా పోటీ చెయ్యడం, సమైక్యంగా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడం సాధ్యమా ? ఎన్ని సాధ్యం కాలేదు ? ఇది కూడా సాధ్యమౌతుందని ఆశిద్దాం !! మనిషి ఆశాజీవి దా ! క్షమించాలి. నా రాజకీయ పరిజ్ఞానం పరిమితం. అయినా నేను కూడా ఆశాజీవినే !

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం