Wednesday, September 9, 2009

మనమెందుకు వెనుకబడి ఉన్నాం ?

జాతీయ స్థాయిలో 2007వ సంవత్సరానికి చలనచిత్ర రంగ అవార్దులు ప్రకటించారు. తెలుగుకి మచ్చుకి ఒక అవార్దు కూడా రాలేదు. దీనికి కారణం ఏమిటి ? చలనచిత్రరంగం ఒక్కసారి ప్రశ్నించుకుంటే బాగుంటుంది. తప్పెవరిదని నిందారోపణలు చేసుకునే బదులు సమస్య మూలాల్లోకి వెళ్ళి పరిశీలన జరిపి జాతీయ స్థాయిలొనే కాదు, అంతర్జాతీయ స్థాయిలొ తెలుగు చలన చిత్ర బావుటా ఎగురవెయ్యడానికి కృషి చెయ్యాలి. ఎవరు చెయ్యాలి ? మిల్లియన్ డాలర్ ప్రశ్న. ఇంకెవరు.. చలనచిత్ర రంగ మేధావులే ! అయితే ఎలా ?
చలనచిత్రాలు ప్రారంభమైన దగ్గర్నుండీ నిర్మాతలు తమ పెట్టుబడికి రక్షణ కోసం ప్రయోగాలు చెయ్యడానికి పూనుకునేవారు కాదు. అది సహజం కూడా ! ఎందుకంటే ఇందులో లక్షల,కోట్ల రూపాయల పెట్టుబడి అవసరముంది. అంత పెట్టుబడి స్వంతంగానో,అప్పు తెచ్చో పెట్టిన నిర్మాత నష్టాలను భరించె పరిస్థిలొ ఉండడుగదా !! అందుకే రిస్కు గేం ఆడలేడు. ఈ బలహీనతే సినిమా బద్జెట్ ని కోటలు దాటించింది. దాంతో నిర్మాత మరింత ఊబిలొకి దిగిపొయాడు. కేవలం రిస్క్ అనే పదాన్ని ఉపయోగించి నిర్మాతల్ని దోచేసే కార్యక్రమం ప్రారంభమయింది. రెమ్యునరేషన్లు పెంచేసారు. స్టార్ డం ప్రారంభమయింది. అన్ని ఖర్చులు పెంచేసారు. చిత్రం భారీగా లెకపొతే జనం చూడరనే సిద్ధాంతాన్ని ప్రచారంలొకి తెచ్చారు. అందుకు కథానుగుణంగా అనే పరిస్థితి నుంచి, దాన్ని పట్టించుకోకుండా అసంబద్ధమైన సన్నివేశాలు, డాన్సులు, ఫైట్స్ వీటికోసం పరభాషలనుంచి నటుల్ని, ఇతరుల్ని అరువు తెచ్చుకోవటం ప్రారంభమయింది. వాళ్ళు అక్కడ ఏ రేటులో ఉంటారో తెలియదుగానీ ఇక్కడ మాత్రం భారీగా డిమాండ్ చేస్తారు. ఈ భాగోతం వెనుక అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. అది వేరే విషయం. నిర్మాత మంచి సినిమా తియ్యలనే ఉద్దేశ్యంతోనే తన ప్రయాణం ప్రారంభిస్తాడు. అయితే అడుగడుగునా 'రిస్క్' బూచిని చూపించి భయపెట్టేవాళ్ళు చేరుతారు. విశేష అనుభవం గలిగిన నిర్మాతలు సైతం ఈ పరిస్థితిని తప్పించుకోలేకపోతున్నారనటంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు.
నిర్మాతలు ఒకసారి ఆలోచిస్తే మంచి చిత్రాలనిపించుకుని కమర్షియల్ గా కూడా హిట్ అయిన చిత్రాలన్నిటిలొ ఏ భారీతనం ఉంది ? కథ,కథనంలలో మాత్రమే భారీతనం కనిపిస్తుంది. అలాంటి చిత్రాలెన్నొ ఉన్నాయి. ఉదాహరణకు ' శంకరాభరణం ' లో స్టార్లెవరున్నారని, ఏ భారీతనముందని అంత పెద్ద హిట్ అయింది ? తెలుగు చిత్రాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిని తీసుకొచ్చింది. ఇటీవలికాలంలో వచ్చిన ఆనంద్,బొమ్మరిల్లు,ఐతే వగైరా సినిమాల పరిస్థితి ఏమిటి ? వాటితోబాటు విడుదలయిన సోకాల్డు భారీ, స్టార్ చిత్రాలు వీటి ముందు ఎందుకు నిలబడలెకపోయాయి ? కారణం ఒక్కటె! ప్రేక్షకులకు కావల్సింది ప్రధానంగా కథ, కథనాలే అనేది స్పష్టం. అందులో వారికి స్టార్లుండనక్కరలేదు,హంగులక్కరలేదు. చక్కటి కథకు అందమైన ట్రీట్మెంటునివ్వగల దర్శకుడుంటే చాలు. ఎక్కువమంది వంటవాళ్ళు కలిస్తే వంటకాన్ని పాడుచేస్తారని సామెత. సినిమా ప్రధానంగా దర్శకుని సృష్టి. దార్శనికుడే దర్శకుడు. అంటే విజన్ అతనిది. కథ గురించి నిర్మాత, దర్శకుడు చర్చించి ఒక అంగీకారానికి రావటంలొ తప్పులెదు. కానీ చాలా సందర్భాలలొ కథలొ అనేకమంది జొక్యం చేసుకుని వారి వారి అబిరుచులను అందులో చొప్పించడానికి ప్రయత్నించటంతో అసలు కథ స్వరూప స్వభావాలు సమూలంగా మారిపోతున్నాయి. అలాంటప్పుడు దర్శకుడు నిస్సహాయంగా మిగిలిపోతాడు. స్టార్లనిపించుకునే హీరోల సినిమాల్లో ప్రధానంగా ఈ పరిస్థితి కనిపిస్తుంది. అయితే వారిలోనూ కథ, కథనాలకు, దర్శకుని సీనియార్టీకి కాక అతని విజన్ కి ప్రాధాన్యం ఇచ్చే వారు లేకపొలెదు. అందుకే అలాంటి వారి చిత్రాలు సేఫ్టీ జోన్ లోనే ఉంటాయి. అందరికీ కథ ఇంప్రూవుమెంటుకి సలహాలనందించే స్వేచ్చ ఉంది. కానీ తుది నిర్ణయం మాత్రం దర్శకునికి వదిలివేస్తే వాటిని సరైన పద్ధతిలొ ఉపయోగించుకుని మంచి ఫలితాల్ని అందించే అవకాశం ఉంది.
ఇక విజయాల విషయానికొస్తే భారీ చిత్రాల హిట్ శాతంకంటే కథా కథనాల బలం ఉన్న చిత్రాల విజయాల శాతం ఎక్కువ అనేది చరిత్ర పరిశీలిస్తే అర్థం అవుతుంది. కథా బలం ఉన్న చిత్రాలకు భారీ పెట్టుబడులవసరం లేదు. కథ డిమాండ్ చేసినంతవరకూ పెట్టుబడి సరిపొతుంది. ఇవి ఫెయిలయినా వచ్చే నష్టం శాతం తక్కువగానే ఉంటుంది. భారీ చిత్రాల నష్టం శాతం కూడా భారీగానే ఉంటుంది. వాటి వలన పరిశ్రమతో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సంబంధమున్న చాలామంది నష్టపోతారు. దాని ప్రభావం చాలా కాలం ఉంటుంది. ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ రిస్క్ అనే బూచిని చూస్తే అందరికీ భయమే ! కాబట్టి పరిశ్రమకు గుండెలాంటి నిర్మాతలు ఈ విషయాలనన్నిటినీ విశ్లేషించుకుని కథ, కథనాలకు,దర్శకుని విజన్ కి విలువ ఇస్తే మంచి చిత్రాలు వస్తాయి. విజయం సాధిస్తాయి. వీటికి అవార్డులుకోసం లాబీయింగ్ చెయ్యనక్కర్లెదు. ఈ రోజు ఒక టీవీ చానెల్ చర్చలొ ఒక సినీ ప్రముఖుడు చెప్పినట్లు అవార్డుల కోసం సినిమా తీసి చేతులు కాల్చుకోనక్కర్లేదు. నిర్మాతల్లారా! ప్రేక్షకుల రివార్డులకొసం సినిమాలు తియ్యండి. అవే లాభాలతోబాటు అవార్దులను కూడా తెచ్చిపెడతాయి. అప్పుడు మన చిత్రాలకు అవార్డులు ఇవ్వలేదనీ, ఎవరో ఏదో అన్నారనో బాధపడే పరిస్థితి తప్పుతుంది.

No comments:

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం