Saturday, September 19, 2009

రావణ కాష్టం

స్త్రీల మీద అఘాయిత్యాలు ప్రతి రోజూ పెరిగిపోతున్నాయి. ఈ చిచ్చు ఆరడం లేదు. నిత్యాగ్నిహోత్రంలా మండుతోంది. ఈ ఘోరాల్ని పవిత్రమైన అగ్నిహోత్రంతో పోల్చడం సరికాదేమో ! మనం నాగరిక ప్రపంచంలోనే ఉన్నామా అనే సందేహం కలుగుతోంది. కొంతకాలం క్రితం వరకూ ఆడవాళ్లమీద అత్యాచారాలు, గృహ హింసలు మాత్రమె వినేవాళ్ళం. ఇప్పుడున్నంతగా మీడియా విస్తరించలేదు. అప్పట్లో స్త్రీల మీద సాంప్రదాయాల ముసుగులో ఉన్న ఆంక్షల వలన చాలా విషయాలు బయటకు వచ్చేవికావు. అంతే కాదు ఎక్కువగా చదివించకపోవడం కూడా వారి వెనుకబాటుతనానికి కారణం కావచ్చు. ఇప్పుడు చాలామంది తలిదండ్రులు ఆడపిల్లలకు చదువు అవసరాన్ని, ఆర్ధిక స్వావలంబన ఆవశ్యకతను గుర్తించారు. ప్రోత్సహిస్తున్నారు. దీనికారణంగా ఎంతోమంది అమ్మాయిలు చదువు పేరుతో, ఉద్యోగాల పేరుతో బయటకు వస్తున్నారు. ఒకప్పుడు సాయంత్రం ఆరుగంటలు దాటితే బయటకు వెళ్లడానికి భయపడే స్త్రీలు ఇప్పుడు అర్థరాత్రి దాటేవరకూ బయట తిరగాల్సివచ్చినా జంకటంలేదు. ఒంటరిగా బయటకు వెళ్లడానికి సంకోచించే పరిస్థితిని దాటేసి విదేశాలకు సైతం వెళ్లి వస్తున్నారు. అడపా దడపా కొన్ని సంఘటనలు జరిగినా మొన్నమొన్నటి వరకూ పరిస్థితి ఇదే !! స్త్రీల విషయంలో సమాజంలో వచ్చిన ఈ మార్పుకి లింగ వివక్షత లేకుండా చాలామంది సంతోషించారు. ఆడది చదువుకుంటే కుటుంబమంతా చడువుకోన్నట్లే ! ఇది సత్యమని అందరూ నమ్మారు. అందుకే పరీక్షల్లో విజయ శాతంలో అబ్బాయిల్ని మించిపోయారు. ఉద్యోగాలకు పోటీలో, విజయాల్లో ... వ్యాపార విజయాల్లో ... ఇంకా అనేక రంగాల్లో పురుషుల్ని మించిపోతున్నారనటంలో ఏ మాత్రం సందేహం లేదు. అణగదొక్కబడిన ఏ జాతిలోనైనా సహజంగా వుండే పట్టుదల, కృషి, ముఖ్యంగా అంకితభావం నేటి స్త్రీలలో కనిపిస్తుంది. అవే వారి పురోభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఏ లోకంలో ఉన్నా ఈ అభివృద్ధిని గాందీజీ సంతోషిస్తూ ఉంది ఉంటారు.
బహుశా ఈ పురోగమనమే ఇటీవల వారిపై పెరుగుతున్న దాడులకు కారణమేమోననిపిస్తోంది. మన నరనరాల్లో గత కొన్ని శతాబ్దాలుగా జీర్ణించుకుపోయిన స్త్రీలను అణగదొక్కే ధోరణి మళ్ళీ జూలు విదిలిస్తోందా ! పాతకాలంనాటి తరంలో వివక్షత ఉన్నా కొన్ని పరిమితుల్లోనే ఉన్నట్లు తోస్తుంది. ప్రస్తుత తరంలో లాగ ప్రేమను బలవంతంగా పొందాలనే ధోరణి అప్పుడులేదు. ప్రేమను ప్రేమతోనే పొందాలనే ఉద్దేశ్యం కనబడేది. ఈ రెండు తరాల మధ్యలోని తరం స్త్రీల పట్ల ఖచ్చితంగా ఆదర్శవంతమైన, ఆరోగ్యవంతమైన ఆలోచనలు కలిగి ఉందని చెప్పుకోవచ్చుననుకుంటాను. ఎందుకంటే స్త్రీ అభ్యుదయానికి నాంది పలికింది ఆ తరంలోనే ! స్త్రీల విజయాలు ఎక్కువగా నమోదయింది ఆ తరంలోనే !! సృష్టిలో స్త్రీ పురుషులిద్దరికీ సమాన బాధ్యతలున్నాయనేది నిర్వివాదాశం. ఇద్దరిలో ఏ ఒక్కరి వల్లో సృష్టి సాధ్యం కాదు. ఇది కొంతవరకైనా గ్రహించిన తరం ఆ తరమే !!! ఇది ఇంకా పురోగమించాలి. కానీ ఈ తిరోగమనమేమిటి ? నవనాగరిక సమాజంలో ఇది ఏ పరిణామాలకి దారి తీస్తుంది ? అరాచకం మాత్రమే ఎరిగిన ఆటవిక యుగం లోకి మళ్ళీ వెళ్లి పోతున్నామా ? ప్రపంచమంతా చిన్న గ్రామం మాదిరిగా మార్చేస్తుందనుకున్న విజ్ఞానం వెర్రి తలలు వేస్తోందా ? ఈ మధ్య స్త్రీల మీద విపరీతంగా పెరిగిన యాసిడ్ దాడులు, అత్యాచారాలు, హత్యలు, వావి వరసల్లేని దౌర్జన్యాలు ఇవన్నీ ఈ సందేహాల్ని కలిగిస్తున్నాయి. ఒకటిమాత్రం నిజం ఇదివరలో ఇలాంటి సంఘటనలు అక్కడక్కడా జరిగినా అవి వార్తాపత్రికల్లో కొన్ని పరిధుల మేర ప్రచురించేవారు. పోలీసు స్టేషన్లో కూడా అధికారిక సమాచారం తీసుకున్నాకే ఆయా విలేఖరులు వార్త పంపేవారు. సంపాదకులు కూడా అవసరాన్ని బట్టి నిర్థారించుకున్నాకే ప్రచురించేవారు. ప్రజలు కూడా ఉదయం మాత్రమే ఆ వార్త చదివేవారు. మరి ఇప్పుడో ఒక సంఘటన జరిగితే ఆ రోజు టీవీ చానళ్ళకు పండగే ! సమాచారంలోని నిజానిజాలు తెలుసుకునే సమయం కూడా వాళ్ళకుండదు . ఆ ఒక్క సంఘటనను పదే పదే అనేక సార్లు అనేక రకాలుగా రోజంతా వీలయితే ఇంకా కొన్ని రోజులు చూపిస్తున్నారు. దానివల్ల ఆ సంఘటనకు కారకులైన వారు తప్పించుకోకుండా, తప్పించకుండా చెయ్యడానికి వీలవుతుందికదా అని వారనవచ్చు. దాని సంగతేమో కానీ బ్రాహ్మణుడు, నల్లకుక్క కథలో లాగ పదే పదే ఆ సంఘటన జరిగిన తీరు వివరించిన తరువాత చూస్తున్నవారిలో మానసిక వికారాలు మొదలయ్యే అవకాశం లేదా !! సమాజంలో మంచి కన్నా చెడు త్వరగా గ్రహించే వారే ఎక్కువగా ఉంటారు. ఈ విషయం ఆయా టీవీ చానళ్ళ వారు ఆలోచించి సంఘటనలోని చెడుని ఎక్కువగా చూపడం కన్నా దానివలన నిందితులకు వచ్చే కష్ట నష్టాల గురించి, వారి మానసిక దౌర్బల్యాన్ని తొలగించే కార్యక్రమాలను ప్రసారం చేస్తే సమాజానికి మేలు చేసిన వారవుతారేమో !! కనీసం సీనియర్ పాత్రికేయులు అధినేతలుగా, అధికారులుగా ఉన్న చానళ్ళయినా ఆరోగ్యకరమైన జర్నలిజాన్ని ప్రోత్సహిస్తే బాగుంటుందని ఆశ పడుతున్నాను. లేదంటే ఈ రావణ కాష్టంలో మరింత ఆజ్యం పోసిన వారవుతారేమో !!

No comments:

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం