Friday, September 4, 2009

చిన్న దీపం వెలిగించి చీకట్లు పారద్రోలండి.

చనిపోయిన వ్యక్తి గురించి చెడు మాట్లాడటం మంచిది కాదనే అభిప్రాయం వెనుక ఒక అర్థం ఉన్నట్లుగా తోస్తోంది. ప్రతి మనిషి జీవితంలో మంచి, చెడు రెండూ ఉంటాయి. బతికున్నప్పుడు వారిలోని చెడుని ఎత్తిచూపి సరైన మార్గానికి తీసుకురావడానికి ప్రయత్నించటం అందరి విధి. కానీ అతను చనిపోయినపుడు, అది కూడా ప్రముఖ వ్యక్తి అయినపుడు ఆ సమయంలో అతనిలోని చెడుని ప్రస్తావించడం వలన చాలామంది మనస్సులో వారికి తెలియకుండానే చెడు బీజాలు నాటుకునే అవకాశం ఉంది. అదే అతనిలోని మంచిని మాత్రమే ప్రస్తావించడం వలన కనీసం ఆలోచన మొదలవుతుంది. ఈ ఉద్దేశ్యంతోనే చనిపోయిన వ్యక్తి గురించి మంచిని మాత్రమె మాట్లాడే సంప్రదాయం వచ్చి ఉంటుంది. ఇక వై.యస్. గురించి. మనకు ఎందఱో ముఖ్యమంత్రులు వచ్చారు. వెళ్ళారు. కానీ ప్రజలందరి ఆకలి తీర్చే అన్నదాతల కష్టం గురించి ఎవరు ఆలోచించారు ? నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఎంత భూమిని సస్యశ్యామలం చేసింది, ఎంతమందికి జీవనోపాధి కల్పించిందీ మనందరికీ తెలియని విషయం కాదు. దాని తర్వాత కాలంలో మన రాష్ట్ర జనాభా పెరుగుతుందని, ఆహారధాన్యాల అవసరాలు పెరుగుతాయని నాయకులెవరికీ తెలియదా ? తమ పదవి నిలుపుకొనే ఆలోచనే తప్ప ఆ దిశగా ఆలోచించి సాగునీటి ప్రాజెక్ట్ ల నిర్మాణానికి ప్రయత్నం చేసిన వారెవరు ? సామాన్య ప్రజలకు ఖరీదైన వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన నాయకుడెవరు ? ఇంకా ... ఎన్నో పథకాలే ఆయనకీ ప్రాముఖ్యత తెచ్చాయనేది నిజం. ప్రజలతో మమేకమైతేనే, వారి సమస్యల పరిష్కారం గురించి వారితోనే చర్చిస్తే అధికారం నిలుపుకోవడం మాత్రమె కాదు, మనిషిగా అందరి గుండెల్లో నిలిచిపోతాడని నిరూపించిన నాయకుడు రాజశేఖర రెడ్డి. ప్రజాప్రతినిధిగా ఎన్నికవడానికి , అధికారం తెచ్చుకోవడానికీ కొత్త సూత్రాల్ని రచించాడనడంలో సందేహం లేదు. రాజకీయనాయకుల ఎ.సి. ఛాంబర్ లూ, హై టెక్ హంగులూ ప్రజలకక్కరలేదని నిరూపించిన వ్యక్తి. ఇక రెండో పార్శ్వం. అవినీతి గురించి. దాన్ని పెంచి పోషిస్తున్నది మనం కాదా ? మన పనులు జరిపించుకోవడానికి అవినీతిని ఆశ్రయించడం లేదా ? అప్పుడు మన పని పూర్తి అవడం మనకి ముఖ్యం. అందుకే నిలదీసే కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా వేసుకుంటాం. నాయకులు ప్రజల్లోకి వచ్చినపుడు మనకు ఈ విషయంలో నిలదీసే అవకాశం ఉందికదా ? ఎక్కడో కూర్చుని పధకాలు రచించే వాళ్ళనేమీ చెయ్యలేము కదా ? మన చుట్టూ ఉన్నా అవినీతిని నిలదీసే బాధ్యత మనది కాదా ? ఆ అవకాశం కల్పించడానికి ప్రయత్నించిన నాయకుడేడి ? హేమాహేమీలైన సీనియర్ రాజకీయ చాణుక్యులు ఉండి కూడా అసమ్మతి రాగాలు గట్టిగా వినిపించలేకపోవడానికి కారణం ప్రజలలో బలం కాదా ? ప్రజా బలాన్ని నిరూపించిన నాయకుడు వై.యస్.కాదా ?
ఆయనలోని చెడుని ఆయనతోటే పంపించెయ్యండి. ఆయన మంచి ఆలోచల్ని గురించి అందరికీ వీలైనన్ని సార్లు చెప్పండి. అప్పుడు తెరవెనుక నడుస్తుందనుకుంటున్న రాజకీయం భయపడుతుంది. కొంతవరకైనా వారిలో బాధ్యత పెరిగే అవకాశం ఉంది. ఎప్పుడూ చెడుని తిట్టడం కంటే మంచిని ప్రోత్సహించడం మంచి ఫలితాల్నిస్తుందేమో కదా ? బ్లాగర్లందరూ ఈ విషయం ఆలోచిస్తారు కదూ !

1 comment:

Mauli said...

నాయకులు ప్రజల్లోకి వచ్చినపుడు మనకు ఈ విషయంలో నిలదీసే అవకాశం ఉందికదా ?


ఎందుకు లేదు, మరి రావణాసురుడి ని ఎవరికి వారు ఎదిరించక అవతార మూర్తి కోసం ఎందుకు ఎదురు చూసారు . బ్రిటిష్ వారు బయటి వారు కనుక ఎదిరించడం సాధ్యం అయ్యింది. మనలోని వాళ్ళని ఎదిరించి ఎవరూ బ్రతుకలేరు .పోనీ ఒక పదిమంది పోయిన పర్లేదు అందరి కోసం అంటారా...అయితే ఎవరా పది మంది? ఎవరి కోసం ఆ పదిమంది? వాళ్ళది తప్పు లేదు, వాళ్ళని అడిగే వాళ్ళు లేనంత వరకు అంటే ప్రకృతి మాత్రం చూస్తూ ఊరుకోదు. అది నేను కాని YSR కాని...

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం