Sunday, September 27, 2009

మనలోని మహిషాసుర మర్దనం

మహిషాసుర మర్దన అంటే దుష్ట సంహారమే దసరా . మనలోపల కూడా మహిషాసురులుంటారు . వారిని మర్దించే దుర్గలూ ఉంటారు. ఎటొచ్చీ వారిని గుర్తించడంలో అలసత్వం. గుర్తించినా నిర్మూలించడానికి అహం అడ్డొస్తుంది . అహాన్ని జయిస్తే మనందరం దేవుళ్ళూ , దేవతలూ అయిపోతాం. సహజంగానే అహాన్ని జయించడం మనకిష్టం ఉండదు పండగలూ, పూజలూ ఉన్నది మన కర్తవ్యాన్ని మనకు గుర్తుచెయ్యడానికే ! అందుకే విజయదశమి మనలోని దుర్గను మేల్కొలిపి మహిషాసుర మర్దన చేయిస్తుందని మరోసారి ఆశిస్తూ .......


సర్దార్ కు నివాళి


దేశమాత దాస్య విముక్తికోసం పోరాటం చేసి అతి చిన్నవయస్సులో ఉరిశిక్షకు గురయిన సర్దార్ భగత్ సింగ్ జయంతి నేడు. త్యాగధనుల్ని స్మరించుకోవడం మన కర్తవ్యమ్.

Saturday, September 26, 2009

దుర్గాష్టమి

Friday, September 25, 2009

అందిన జాబిలి

చందమామ రావే !
జాబిల్లి రావే !!

అని చిన్నప్పుడు పాడుకున్నాం. మరి ఇప్పటి పిల్లలు పాడుకుంటూ ఉన్నారో , లేదో తెలీదు. కానీ మన శాస్త్రవేత్తలు మాత్రం మనకు చందమామని అందించేసే ప్రయత్నాల్లో ముందడుగు వేసారు. కంగా చందమామ మీద మనకు కాలనీలు కట్టించేస్తారుట ! ఇప్పటివరకూ చందమామ మనకు చుట్టమనేది కవుల కల్పనలోనే అనుకుంటున్నాం !! కల్పన కాదని నిజంగానే చందమామ మనకు దగ్గర చుట్టమని తేల్చేసారు మన శాస్త్రవేత్తలు . అగ్ర దేశాలు గత నలభై, యాభై సంవత్సరాలుగా అనేక ప్రయోగాలుచేసినా నిర్థారించలేకపోయిన విషయాన్ని మన ప్రయోగం సాధించడం గర్వకారణమే !!! శాస్త్ర పరిజ్ఞానం ఇంత అభివృద్ది చెంది, స్వయంగా గ్రహాలను, గతులనూ పరిశీలించే అవకాశాలున్న రోజుల్లో మాత్రం సాధించినందుకే పొంగిపోతున్నాం ! ' మాత్రం' అని ఎందుకన్నానంటే సదుపాయాలు లేని రోజుల్లోనే గ్రహగతుల్ని ఖచ్చితంగా అంచనా వెయ్యడంలో, వాటిని ఆధారం చేసుకుని భవిష్యత్తు దర్శనం చెయ్యడంలో మన దేశం ప్రాచీనకాలంలోనే ముందంజలో ఉంది. విషయం ఎవ్వరూ కాదనలేని సత్యం. 'అన్నీ వేదాల్లో ఉన్నాయష ' అనే డైలాగుని వెటకారం చేసే వాళ్ళను మనమేం చెయ్యగలం... అంతరిక్ష పరిశోధనలో ప్రపంచానికే దారి చూపించిన ప్రస్తుత మన శాస్త్రవేత్తల పరిజ్ఞానాన్ని చూపించడం తప్ప. తల్లిదండ్రులందరూ ఇప్పటికైనా మన ప్రాచీన విజ్ఞాన చరిత్ర మీద తమ పిల్లలకి అవగాహన కలిగేటట్లు చేస్తే మన దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనటంలో సందేహం లేదు.

Monday, September 21, 2009

ఆంధ్రలో తొలి చిత్ర ప్రదర్శనశాల

చిత్ర వైభవం - 008

ఆంధ్ర దేశంలో మొదటి సినిమా
థియేటరు వెలసిన నగరంగా విజయవాడ ప్రసిద్ధికెక్కింది.


గమనిక : స్పష్టతకోసం పేజీమీద క్లిక్ చెయ్యండి.

రంజాన్ శుభాకాంక్షలు


మిత్రులందరికీ
రంజాన్ శుభాకాంక్షలు

Saturday, September 19, 2009

రావణ కాష్టం

స్త్రీల మీద అఘాయిత్యాలు ప్రతి రోజూ పెరిగిపోతున్నాయి. ఈ చిచ్చు ఆరడం లేదు. నిత్యాగ్నిహోత్రంలా మండుతోంది. ఈ ఘోరాల్ని పవిత్రమైన అగ్నిహోత్రంతో పోల్చడం సరికాదేమో ! మనం నాగరిక ప్రపంచంలోనే ఉన్నామా అనే సందేహం కలుగుతోంది. కొంతకాలం క్రితం వరకూ ఆడవాళ్లమీద అత్యాచారాలు, గృహ హింసలు మాత్రమె వినేవాళ్ళం. ఇప్పుడున్నంతగా మీడియా విస్తరించలేదు. అప్పట్లో స్త్రీల మీద సాంప్రదాయాల ముసుగులో ఉన్న ఆంక్షల వలన చాలా విషయాలు బయటకు వచ్చేవికావు. అంతే కాదు ఎక్కువగా చదివించకపోవడం కూడా వారి వెనుకబాటుతనానికి కారణం కావచ్చు. ఇప్పుడు చాలామంది తలిదండ్రులు ఆడపిల్లలకు చదువు అవసరాన్ని, ఆర్ధిక స్వావలంబన ఆవశ్యకతను గుర్తించారు. ప్రోత్సహిస్తున్నారు. దీనికారణంగా ఎంతోమంది అమ్మాయిలు చదువు పేరుతో, ఉద్యోగాల పేరుతో బయటకు వస్తున్నారు. ఒకప్పుడు సాయంత్రం ఆరుగంటలు దాటితే బయటకు వెళ్లడానికి భయపడే స్త్రీలు ఇప్పుడు అర్థరాత్రి దాటేవరకూ బయట తిరగాల్సివచ్చినా జంకటంలేదు. ఒంటరిగా బయటకు వెళ్లడానికి సంకోచించే పరిస్థితిని దాటేసి విదేశాలకు సైతం వెళ్లి వస్తున్నారు. అడపా దడపా కొన్ని సంఘటనలు జరిగినా మొన్నమొన్నటి వరకూ పరిస్థితి ఇదే !! స్త్రీల విషయంలో సమాజంలో వచ్చిన ఈ మార్పుకి లింగ వివక్షత లేకుండా చాలామంది సంతోషించారు. ఆడది చదువుకుంటే కుటుంబమంతా చడువుకోన్నట్లే ! ఇది సత్యమని అందరూ నమ్మారు. అందుకే పరీక్షల్లో విజయ శాతంలో అబ్బాయిల్ని మించిపోయారు. ఉద్యోగాలకు పోటీలో, విజయాల్లో ... వ్యాపార విజయాల్లో ... ఇంకా అనేక రంగాల్లో పురుషుల్ని మించిపోతున్నారనటంలో ఏ మాత్రం సందేహం లేదు. అణగదొక్కబడిన ఏ జాతిలోనైనా సహజంగా వుండే పట్టుదల, కృషి, ముఖ్యంగా అంకితభావం నేటి స్త్రీలలో కనిపిస్తుంది. అవే వారి పురోభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఏ లోకంలో ఉన్నా ఈ అభివృద్ధిని గాందీజీ సంతోషిస్తూ ఉంది ఉంటారు.
బహుశా ఈ పురోగమనమే ఇటీవల వారిపై పెరుగుతున్న దాడులకు కారణమేమోననిపిస్తోంది. మన నరనరాల్లో గత కొన్ని శతాబ్దాలుగా జీర్ణించుకుపోయిన స్త్రీలను అణగదొక్కే ధోరణి మళ్ళీ జూలు విదిలిస్తోందా ! పాతకాలంనాటి తరంలో వివక్షత ఉన్నా కొన్ని పరిమితుల్లోనే ఉన్నట్లు తోస్తుంది. ప్రస్తుత తరంలో లాగ ప్రేమను బలవంతంగా పొందాలనే ధోరణి అప్పుడులేదు. ప్రేమను ప్రేమతోనే పొందాలనే ఉద్దేశ్యం కనబడేది. ఈ రెండు తరాల మధ్యలోని తరం స్త్రీల పట్ల ఖచ్చితంగా ఆదర్శవంతమైన, ఆరోగ్యవంతమైన ఆలోచనలు కలిగి ఉందని చెప్పుకోవచ్చుననుకుంటాను. ఎందుకంటే స్త్రీ అభ్యుదయానికి నాంది పలికింది ఆ తరంలోనే ! స్త్రీల విజయాలు ఎక్కువగా నమోదయింది ఆ తరంలోనే !! సృష్టిలో స్త్రీ పురుషులిద్దరికీ సమాన బాధ్యతలున్నాయనేది నిర్వివాదాశం. ఇద్దరిలో ఏ ఒక్కరి వల్లో సృష్టి సాధ్యం కాదు. ఇది కొంతవరకైనా గ్రహించిన తరం ఆ తరమే !!! ఇది ఇంకా పురోగమించాలి. కానీ ఈ తిరోగమనమేమిటి ? నవనాగరిక సమాజంలో ఇది ఏ పరిణామాలకి దారి తీస్తుంది ? అరాచకం మాత్రమే ఎరిగిన ఆటవిక యుగం లోకి మళ్ళీ వెళ్లి పోతున్నామా ? ప్రపంచమంతా చిన్న గ్రామం మాదిరిగా మార్చేస్తుందనుకున్న విజ్ఞానం వెర్రి తలలు వేస్తోందా ? ఈ మధ్య స్త్రీల మీద విపరీతంగా పెరిగిన యాసిడ్ దాడులు, అత్యాచారాలు, హత్యలు, వావి వరసల్లేని దౌర్జన్యాలు ఇవన్నీ ఈ సందేహాల్ని కలిగిస్తున్నాయి. ఒకటిమాత్రం నిజం ఇదివరలో ఇలాంటి సంఘటనలు అక్కడక్కడా జరిగినా అవి వార్తాపత్రికల్లో కొన్ని పరిధుల మేర ప్రచురించేవారు. పోలీసు స్టేషన్లో కూడా అధికారిక సమాచారం తీసుకున్నాకే ఆయా విలేఖరులు వార్త పంపేవారు. సంపాదకులు కూడా అవసరాన్ని బట్టి నిర్థారించుకున్నాకే ప్రచురించేవారు. ప్రజలు కూడా ఉదయం మాత్రమే ఆ వార్త చదివేవారు. మరి ఇప్పుడో ఒక సంఘటన జరిగితే ఆ రోజు టీవీ చానళ్ళకు పండగే ! సమాచారంలోని నిజానిజాలు తెలుసుకునే సమయం కూడా వాళ్ళకుండదు . ఆ ఒక్క సంఘటనను పదే పదే అనేక సార్లు అనేక రకాలుగా రోజంతా వీలయితే ఇంకా కొన్ని రోజులు చూపిస్తున్నారు. దానివల్ల ఆ సంఘటనకు కారకులైన వారు తప్పించుకోకుండా, తప్పించకుండా చెయ్యడానికి వీలవుతుందికదా అని వారనవచ్చు. దాని సంగతేమో కానీ బ్రాహ్మణుడు, నల్లకుక్క కథలో లాగ పదే పదే ఆ సంఘటన జరిగిన తీరు వివరించిన తరువాత చూస్తున్నవారిలో మానసిక వికారాలు మొదలయ్యే అవకాశం లేదా !! సమాజంలో మంచి కన్నా చెడు త్వరగా గ్రహించే వారే ఎక్కువగా ఉంటారు. ఈ విషయం ఆయా టీవీ చానళ్ళ వారు ఆలోచించి సంఘటనలోని చెడుని ఎక్కువగా చూపడం కన్నా దానివలన నిందితులకు వచ్చే కష్ట నష్టాల గురించి, వారి మానసిక దౌర్బల్యాన్ని తొలగించే కార్యక్రమాలను ప్రసారం చేస్తే సమాజానికి మేలు చేసిన వారవుతారేమో !! కనీసం సీనియర్ పాత్రికేయులు అధినేతలుగా, అధికారులుగా ఉన్న చానళ్ళయినా ఆరోగ్యకరమైన జర్నలిజాన్ని ప్రోత్సహిస్తే బాగుంటుందని ఆశ పడుతున్నాను. లేదంటే ఈ రావణ కాష్టంలో మరింత ఆజ్యం పోసిన వారవుతారేమో !!

Wednesday, September 16, 2009

భారత గాన కోకిల

భారత కోకిలగా ప్రసిద్ధికెక్కిన సరోజినీ నాయుడు ప్రశంసలందుకొని బిరుదును తనదిగా చేసుకొన్న గంధర్వ గాయని ఎం. ఎస్. సుబ్బులక్ష్మి జయంతి సందర్భంగా......

Wednesday, September 9, 2009

మనమెందుకు వెనుకబడి ఉన్నాం ?

జాతీయ స్థాయిలో 2007వ సంవత్సరానికి చలనచిత్ర రంగ అవార్దులు ప్రకటించారు. తెలుగుకి మచ్చుకి ఒక అవార్దు కూడా రాలేదు. దీనికి కారణం ఏమిటి ? చలనచిత్రరంగం ఒక్కసారి ప్రశ్నించుకుంటే బాగుంటుంది. తప్పెవరిదని నిందారోపణలు చేసుకునే బదులు సమస్య మూలాల్లోకి వెళ్ళి పరిశీలన జరిపి జాతీయ స్థాయిలొనే కాదు, అంతర్జాతీయ స్థాయిలొ తెలుగు చలన చిత్ర బావుటా ఎగురవెయ్యడానికి కృషి చెయ్యాలి. ఎవరు చెయ్యాలి ? మిల్లియన్ డాలర్ ప్రశ్న. ఇంకెవరు.. చలనచిత్ర రంగ మేధావులే ! అయితే ఎలా ?
చలనచిత్రాలు ప్రారంభమైన దగ్గర్నుండీ నిర్మాతలు తమ పెట్టుబడికి రక్షణ కోసం ప్రయోగాలు చెయ్యడానికి పూనుకునేవారు కాదు. అది సహజం కూడా ! ఎందుకంటే ఇందులో లక్షల,కోట్ల రూపాయల పెట్టుబడి అవసరముంది. అంత పెట్టుబడి స్వంతంగానో,అప్పు తెచ్చో పెట్టిన నిర్మాత నష్టాలను భరించె పరిస్థిలొ ఉండడుగదా !! అందుకే రిస్కు గేం ఆడలేడు. ఈ బలహీనతే సినిమా బద్జెట్ ని కోటలు దాటించింది. దాంతో నిర్మాత మరింత ఊబిలొకి దిగిపొయాడు. కేవలం రిస్క్ అనే పదాన్ని ఉపయోగించి నిర్మాతల్ని దోచేసే కార్యక్రమం ప్రారంభమయింది. రెమ్యునరేషన్లు పెంచేసారు. స్టార్ డం ప్రారంభమయింది. అన్ని ఖర్చులు పెంచేసారు. చిత్రం భారీగా లెకపొతే జనం చూడరనే సిద్ధాంతాన్ని ప్రచారంలొకి తెచ్చారు. అందుకు కథానుగుణంగా అనే పరిస్థితి నుంచి, దాన్ని పట్టించుకోకుండా అసంబద్ధమైన సన్నివేశాలు, డాన్సులు, ఫైట్స్ వీటికోసం పరభాషలనుంచి నటుల్ని, ఇతరుల్ని అరువు తెచ్చుకోవటం ప్రారంభమయింది. వాళ్ళు అక్కడ ఏ రేటులో ఉంటారో తెలియదుగానీ ఇక్కడ మాత్రం భారీగా డిమాండ్ చేస్తారు. ఈ భాగోతం వెనుక అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. అది వేరే విషయం. నిర్మాత మంచి సినిమా తియ్యలనే ఉద్దేశ్యంతోనే తన ప్రయాణం ప్రారంభిస్తాడు. అయితే అడుగడుగునా 'రిస్క్' బూచిని చూపించి భయపెట్టేవాళ్ళు చేరుతారు. విశేష అనుభవం గలిగిన నిర్మాతలు సైతం ఈ పరిస్థితిని తప్పించుకోలేకపోతున్నారనటంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు.
నిర్మాతలు ఒకసారి ఆలోచిస్తే మంచి చిత్రాలనిపించుకుని కమర్షియల్ గా కూడా హిట్ అయిన చిత్రాలన్నిటిలొ ఏ భారీతనం ఉంది ? కథ,కథనంలలో మాత్రమే భారీతనం కనిపిస్తుంది. అలాంటి చిత్రాలెన్నొ ఉన్నాయి. ఉదాహరణకు ' శంకరాభరణం ' లో స్టార్లెవరున్నారని, ఏ భారీతనముందని అంత పెద్ద హిట్ అయింది ? తెలుగు చిత్రాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిని తీసుకొచ్చింది. ఇటీవలికాలంలో వచ్చిన ఆనంద్,బొమ్మరిల్లు,ఐతే వగైరా సినిమాల పరిస్థితి ఏమిటి ? వాటితోబాటు విడుదలయిన సోకాల్డు భారీ, స్టార్ చిత్రాలు వీటి ముందు ఎందుకు నిలబడలెకపోయాయి ? కారణం ఒక్కటె! ప్రేక్షకులకు కావల్సింది ప్రధానంగా కథ, కథనాలే అనేది స్పష్టం. అందులో వారికి స్టార్లుండనక్కరలేదు,హంగులక్కరలేదు. చక్కటి కథకు అందమైన ట్రీట్మెంటునివ్వగల దర్శకుడుంటే చాలు. ఎక్కువమంది వంటవాళ్ళు కలిస్తే వంటకాన్ని పాడుచేస్తారని సామెత. సినిమా ప్రధానంగా దర్శకుని సృష్టి. దార్శనికుడే దర్శకుడు. అంటే విజన్ అతనిది. కథ గురించి నిర్మాత, దర్శకుడు చర్చించి ఒక అంగీకారానికి రావటంలొ తప్పులెదు. కానీ చాలా సందర్భాలలొ కథలొ అనేకమంది జొక్యం చేసుకుని వారి వారి అబిరుచులను అందులో చొప్పించడానికి ప్రయత్నించటంతో అసలు కథ స్వరూప స్వభావాలు సమూలంగా మారిపోతున్నాయి. అలాంటప్పుడు దర్శకుడు నిస్సహాయంగా మిగిలిపోతాడు. స్టార్లనిపించుకునే హీరోల సినిమాల్లో ప్రధానంగా ఈ పరిస్థితి కనిపిస్తుంది. అయితే వారిలోనూ కథ, కథనాలకు, దర్శకుని సీనియార్టీకి కాక అతని విజన్ కి ప్రాధాన్యం ఇచ్చే వారు లేకపొలెదు. అందుకే అలాంటి వారి చిత్రాలు సేఫ్టీ జోన్ లోనే ఉంటాయి. అందరికీ కథ ఇంప్రూవుమెంటుకి సలహాలనందించే స్వేచ్చ ఉంది. కానీ తుది నిర్ణయం మాత్రం దర్శకునికి వదిలివేస్తే వాటిని సరైన పద్ధతిలొ ఉపయోగించుకుని మంచి ఫలితాల్ని అందించే అవకాశం ఉంది.
ఇక విజయాల విషయానికొస్తే భారీ చిత్రాల హిట్ శాతంకంటే కథా కథనాల బలం ఉన్న చిత్రాల విజయాల శాతం ఎక్కువ అనేది చరిత్ర పరిశీలిస్తే అర్థం అవుతుంది. కథా బలం ఉన్న చిత్రాలకు భారీ పెట్టుబడులవసరం లేదు. కథ డిమాండ్ చేసినంతవరకూ పెట్టుబడి సరిపొతుంది. ఇవి ఫెయిలయినా వచ్చే నష్టం శాతం తక్కువగానే ఉంటుంది. భారీ చిత్రాల నష్టం శాతం కూడా భారీగానే ఉంటుంది. వాటి వలన పరిశ్రమతో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సంబంధమున్న చాలామంది నష్టపోతారు. దాని ప్రభావం చాలా కాలం ఉంటుంది. ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ రిస్క్ అనే బూచిని చూస్తే అందరికీ భయమే ! కాబట్టి పరిశ్రమకు గుండెలాంటి నిర్మాతలు ఈ విషయాలనన్నిటినీ విశ్లేషించుకుని కథ, కథనాలకు,దర్శకుని విజన్ కి విలువ ఇస్తే మంచి చిత్రాలు వస్తాయి. విజయం సాధిస్తాయి. వీటికి అవార్డులుకోసం లాబీయింగ్ చెయ్యనక్కర్లెదు. ఈ రోజు ఒక టీవీ చానెల్ చర్చలొ ఒక సినీ ప్రముఖుడు చెప్పినట్లు అవార్డుల కోసం సినిమా తీసి చేతులు కాల్చుకోనక్కర్లేదు. నిర్మాతల్లారా! ప్రేక్షకుల రివార్డులకొసం సినిమాలు తియ్యండి. అవే లాభాలతోబాటు అవార్దులను కూడా తెచ్చిపెడతాయి. అప్పుడు మన చిత్రాలకు అవార్డులు ఇవ్వలేదనీ, ఎవరో ఏదో అన్నారనో బాధపడే పరిస్థితి తప్పుతుంది.

సుస్వర సంగీత జ్ఞాపకాలు

తెలుగు చిత్ర రంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలులు ఎందఱో ఉన్నారు. వారందరికంటే చాలా ముందే ఘనత సాధించింది భానుమతి గారు. సినిమాలే నిషిద్ధమైన కాలంలో సాంప్రదాయ కుటుంబంలో పుట్టి, సినిమాలలో నటించి నటీమణులకె గౌరవమ్ సంపాదించి పెట్టిన మహిళామణి. నటిగా, దర్శకురాలిగా,నిర్మాతగా, సంగీత దర్శకురాలిగా, గాయకురాలిగా, స్టూడియో యజమానిగా, రచయిత్రిగా...ఒకటా.. రెండా...బహుముఖ ప్రతిభ ఆమె సొంతం.
మన చిత్ర రంగంలో ఇప్పటికీ.. ఎప్పటికీ.. ఎవరూ తనను దాటి వెళ్ళలేని రికార్డులు సొంతం చేసుకున్న సంగీత దర్శకుడు చక్రవర్తి. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించటం ఒక ఎత్తైతే, వాటిలో చాలా భాగం హిట్ కావటం మరో విశేషం.
వీరిద్దరి జన్మదినోత్సవాల్ని పురస్కరించుకుని వారికి నివాళులర్పిస్తూ....
(సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైంది. అయినా వదిలివెయ్యటం ఇష్టం లేక ఇది అందిస్తున్నా !!)

Monday, September 7, 2009

తెలుగులో తొలి టాకీ ఏది ?

చిత్ర వైభవం -007
చరిత్రలో కొన్ని విషయాలు ఖచ్చితంగా నిర్దారించడం కష్టం. అనేక పరిశోధనలు చేసి మనం ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తే దానికి ఎన్నో సవరణలు వచ్చే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అలాగే కొన్నిటిని ఖచ్చితంగా నిర్దారించలేము. అయితే తొలి తెలుగు టాకీ విషయం వివాదం కాకపోవడానికి కారణం నిర్మాత ఒకరే కావడం కావచ్చు.........

Align Center

Friday, September 4, 2009

దృశ్య మాలిక - చి. వై. 006

టాకీలు ఆవిర్భవించిన తొలినాళ్ళలో వచ్చిన కొన్ని చిత్రాలలోనుంచి కొన్ని దృశ్యాలు మీకోసం...........

చిన్న దీపం వెలిగించి చీకట్లు పారద్రోలండి.

చనిపోయిన వ్యక్తి గురించి చెడు మాట్లాడటం మంచిది కాదనే అభిప్రాయం వెనుక ఒక అర్థం ఉన్నట్లుగా తోస్తోంది. ప్రతి మనిషి జీవితంలో మంచి, చెడు రెండూ ఉంటాయి. బతికున్నప్పుడు వారిలోని చెడుని ఎత్తిచూపి సరైన మార్గానికి తీసుకురావడానికి ప్రయత్నించటం అందరి విధి. కానీ అతను చనిపోయినపుడు, అది కూడా ప్రముఖ వ్యక్తి అయినపుడు ఆ సమయంలో అతనిలోని చెడుని ప్రస్తావించడం వలన చాలామంది మనస్సులో వారికి తెలియకుండానే చెడు బీజాలు నాటుకునే అవకాశం ఉంది. అదే అతనిలోని మంచిని మాత్రమే ప్రస్తావించడం వలన కనీసం ఆలోచన మొదలవుతుంది. ఈ ఉద్దేశ్యంతోనే చనిపోయిన వ్యక్తి గురించి మంచిని మాత్రమె మాట్లాడే సంప్రదాయం వచ్చి ఉంటుంది. ఇక వై.యస్. గురించి. మనకు ఎందఱో ముఖ్యమంత్రులు వచ్చారు. వెళ్ళారు. కానీ ప్రజలందరి ఆకలి తీర్చే అన్నదాతల కష్టం గురించి ఎవరు ఆలోచించారు ? నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఎంత భూమిని సస్యశ్యామలం చేసింది, ఎంతమందికి జీవనోపాధి కల్పించిందీ మనందరికీ తెలియని విషయం కాదు. దాని తర్వాత కాలంలో మన రాష్ట్ర జనాభా పెరుగుతుందని, ఆహారధాన్యాల అవసరాలు పెరుగుతాయని నాయకులెవరికీ తెలియదా ? తమ పదవి నిలుపుకొనే ఆలోచనే తప్ప ఆ దిశగా ఆలోచించి సాగునీటి ప్రాజెక్ట్ ల నిర్మాణానికి ప్రయత్నం చేసిన వారెవరు ? సామాన్య ప్రజలకు ఖరీదైన వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన నాయకుడెవరు ? ఇంకా ... ఎన్నో పథకాలే ఆయనకీ ప్రాముఖ్యత తెచ్చాయనేది నిజం. ప్రజలతో మమేకమైతేనే, వారి సమస్యల పరిష్కారం గురించి వారితోనే చర్చిస్తే అధికారం నిలుపుకోవడం మాత్రమె కాదు, మనిషిగా అందరి గుండెల్లో నిలిచిపోతాడని నిరూపించిన నాయకుడు రాజశేఖర రెడ్డి. ప్రజాప్రతినిధిగా ఎన్నికవడానికి , అధికారం తెచ్చుకోవడానికీ కొత్త సూత్రాల్ని రచించాడనడంలో సందేహం లేదు. రాజకీయనాయకుల ఎ.సి. ఛాంబర్ లూ, హై టెక్ హంగులూ ప్రజలకక్కరలేదని నిరూపించిన వ్యక్తి. ఇక రెండో పార్శ్వం. అవినీతి గురించి. దాన్ని పెంచి పోషిస్తున్నది మనం కాదా ? మన పనులు జరిపించుకోవడానికి అవినీతిని ఆశ్రయించడం లేదా ? అప్పుడు మన పని పూర్తి అవడం మనకి ముఖ్యం. అందుకే నిలదీసే కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా వేసుకుంటాం. నాయకులు ప్రజల్లోకి వచ్చినపుడు మనకు ఈ విషయంలో నిలదీసే అవకాశం ఉందికదా ? ఎక్కడో కూర్చుని పధకాలు రచించే వాళ్ళనేమీ చెయ్యలేము కదా ? మన చుట్టూ ఉన్నా అవినీతిని నిలదీసే బాధ్యత మనది కాదా ? ఆ అవకాశం కల్పించడానికి ప్రయత్నించిన నాయకుడేడి ? హేమాహేమీలైన సీనియర్ రాజకీయ చాణుక్యులు ఉండి కూడా అసమ్మతి రాగాలు గట్టిగా వినిపించలేకపోవడానికి కారణం ప్రజలలో బలం కాదా ? ప్రజా బలాన్ని నిరూపించిన నాయకుడు వై.యస్.కాదా ?
ఆయనలోని చెడుని ఆయనతోటే పంపించెయ్యండి. ఆయన మంచి ఆలోచల్ని గురించి అందరికీ వీలైనన్ని సార్లు చెప్పండి. అప్పుడు తెరవెనుక నడుస్తుందనుకుంటున్న రాజకీయం భయపడుతుంది. కొంతవరకైనా వారిలో బాధ్యత పెరిగే అవకాశం ఉంది. ఎప్పుడూ చెడుని తిట్టడం కంటే మంచిని ప్రోత్సహించడం మంచి ఫలితాల్నిస్తుందేమో కదా ? బ్లాగర్లందరూ ఈ విషయం ఆలోచిస్తారు కదూ !

108

108 - జీవన్మరణ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న వారికి ఆశాదీపం. బతుకుమీద ఆశ రేకెత్తించే కరదీపం. ప్రమాదాల్లో చిక్కుకున్న వారికి ప్రమోదం కలిగించే వ్యవస్థ. వ్యవస్థను పటిష్టం చేసి చావుకి దగ్గరగా వెళ్ళిన ఎంతోమందికి జీవం పోసిన రాజశేఖరుని నిర్జీవంగా తరలించి ధన్యత పొందిందా ? అవును. ఎంతోమందికి ఉపయోగిస్తున్న ఆపద్భాంధవి 108 ఆయన్ని సజీవంగా తీసుకొచ్చే పరిస్థితి లేకపోయినా ఆయన పార్ధివ శరీరాన్ని తరలించి తరించింది.
కర్నూలులో హెలికాప్టర్ నుంచి ఆయన భౌతిక కాయాన్ని 108 లో తరలించడం చూసాక ......

Thursday, September 3, 2009

స్మశాన వైరాగ్యం

వై. యస్. రాజశేఖర రెడ్డి - నిన్నటి ఉదయం హెలికాప్టర్ ఎక్కేవరకూ ఒక వి.ఐ.పి. . ప్రముఖ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. రాజకీయ చతురుడు. ఇడుపుల పాయ ఎస్టేట్, అనేక పరిశ్రమలు, వార్తాపత్రిక, వార్తా చానల్... ఇంకా... ఎన్నెన్నో కోట్లకు యజమాని. నిన్న ఆయనతో ప్రయాణం చేసిన సుబ్రహ్మణ్యం, వెస్లీ, పైలట్లు పోలికలో ఆయనకంటే సామాన్యులే. హెలికాప్టర్ ఎక్కేటప్పుడున్న తేడాలు చావులో ఎందుకు కనబడలేదు. మృతదేహాలన్నీ ఒకే రకంగా ఎందుకు మారిపోయాయి. హోదాగానీ , కోట్లు గానీ ఆయన్ని ఎందుకు రక్షించలేకపోయాయి ? సుమారు 25 గంటలపాటు ప్రభుత్వ యంత్రాగం, ఆయనకోసం వెదికిన వందలాదిమంది ప్రజలు ఆయన్ని సజీవుడుగా ఎందుకు తీసుకురాలేక పోయారు ? ఆంధ్రదేశమంతా ప్రజలు చేసిన పూజ పునస్కారాలు ఫలించలేదేందుకు ? గ్రహగతులును లెక్కగట్టి ఆయన సురక్షితంగానే ఉన్నాడని సజీవంగా తిరిగివస్తాడని చెప్పిన జ్యోతిష్యుల మాటలు నీటి మూటలెందుకయ్యాయి ? ఇంకా ... ఎన్నో ప్రశ్నలు. వీటన్నిటికీ ఒకటే సమాధానం. చావులోని విచిత్రం, గొప్పదనం అదే ! దీనికి కుల, మత , ప్రాంత, వర్ణ, స్థాయి లాంటి బేధాలేవీ దానికి లేవు. అవన్నీ నేను, నాదీ, నేనే గొప్ప అనే అహంకారాన్ని నరనరాల నింపుకున్న మనకే ! బతుకంతా ఇలా అహంకరిస్తూ, తోటి మనుష్యులను ఈసడించుకుంటూ ఉండే కంటే పదిమందికీ మంచిచేస్తూ, అది మన బాధ్యతని ఫీలయితే చనిపోయే ముందైనా సంపాదించిన ఆస్తినీ, అదిచ్చిన అహంకారాన్నీ కాకుండా, కాస్త సంతృప్తిని మూట కట్టుకోవచ్చేమో ! ................. ఇదే శ్మశాన వైరాగ్యమంటే !!

రాజశేఖరా !!!


ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దుర్మరణం దురదృష్టకరం. తిరుగులేని నేతగా ఎదుగుతున్న తరుణంలో తిరుగులేని లోకాలకు వెళ్ళిపోయిన వై. యస్. కు నివాళి.
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం